భారీ అంచనాల మధ్య విడుదలైన రామ్ స్కందకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన దక్కుతోంది. ఫైనల్ గా ఏ స్టేటస్ వస్తుందో తెలియాలంటే సోమవారం దాకా ఆగాలి కానీ ఇందులో పలు అంశాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. డైరెక్ట్ గా కాకపోయినా పంచులు రూపంలో సెటైర్లు వేయడం గురించి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో రచ్చ రవి పాత్ర ఉచితాలతో జనాన్ని ఎలా మోసం చేయవచ్చో, ఎంత అమాయకంగా ఓట్లు గుద్దేస్తారో డైలాగు రూపంలో చెప్పిన తీరు ఎవరిని ఉద్దేశించిందో సులభంగానే అర్థం చేసుకుంటున్నారు. వీటికి మాస్ లో రెస్పాన్స్ ఉంది.
సెకండ్ హాఫ్ లో రామ్ బాబాయ్ పాత్ర తనకు బూమ్ బూమ్ బ్రాండ్ మద్యం కావాలని డిమాండ్ చేయడం కూడా వ్యంగ్యమే. అక్కడ సందర్భం లేకపోయినా సృష్టించి మరీ ఆ సంభాషణ పెట్టారు. సీరియస్ సన్నివేశాల్లో లాయర్ తో చెప్పిన మాటలు కూడా అవే అర్థాన్ని ఇస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలుగు రాష్ట్రాల సిఎంలను పక్కా రౌడీ లీడర్లుగా చూపించడం మరో ట్విస్టు. సిఎం కూతురు పెళ్లి అనంతపూర్ లో జరిగినట్టు చూపించడం, భూ దందాలు, బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం కోసం ప్లాన్లు వేయడం ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా పెద్ద లిస్టే ఉంది.
ఇలా రాజకీయ విసుర్లు పొందుపర్చడం బోయపాటి కొత్తేమి కాదు. లెజెండ్ క్లైమాక్స్ లో ఏకంగా ఒక ఎపిసోడ్ మొత్తం దీని మీదే ఉంటుంది. కానీ ఇప్పుడు సీన్ వేరు. ఏపీని అన్నారా తెలంగాణను అన్నారానేది పక్కన పెడితే ఆడియన్స్ సులభంగా అర్థం చేసుకునేలా పంచులు వేసిన మాట వాస్తవం. నిజానికి సెన్సార్ అధికారులకు సైతం అనిపించినా అక్కడ అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదు. స్కందకు ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉంటే వీటి రీచ్ భారీగా పెరిగి ఇంకా వైరలయ్యేవి కానీ ప్రస్తుతానికి పరిమితంగానే అనిపిస్తోంది. దీనికే ఇలా ఉంటే అఖండ 2లో ఇంకెన్ని పొందుపరుస్తారో చూడాలి.