వెంకీ కెప్టెన్.. నాని, తారక్, ప్రభాస్ టీం మెంబర్స్

ఒక విదేశీ క్రికెటర్.. తెలుగు సినిమా నటీనటుల గురించి ప్రత్యేకంగా మాట్లాడటం.. వాళ్ల విశిష్టతల గురించి చెప్పడం అంటే విశేషం అనే చెప్పుకోవాలి. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆఫ్‌స్పిన్నర్లలో ఒకడిగా పేరు తెచ్చుకోవడమే కాక.. టెస్టుల్లో 800 వికెట్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్.. టాలీవుడ్లో మిడ్ రేంజ్ హీరో అయిన నాని గురించి స్టేజ్ మీద మాట్లాడితే ఆశ్చర్యపోకుండా ఉండలేం.

తన బయోపిక్ ‘800’కు సంబంధించి హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రమోషనల్ ఈవెంట్లో మురళీధరన్ ఇలాగే మాట్లాడి అందరి దృష్టినీ ఆకర్షించాడు. మీరు సినిమా నటులు, రాజకీయ నాయకులతో ఒక జట్టును తయారు చేయాలంటే ఎవరిని ఎంచుకుంటారు అని మురళీధరన్‌ను అడిగితే.. ఇండియన్ పొలిటీషియన్స్ గురించి తనకు పెద్దగా తెలియదని చెబుతూ.. తనకు సినిమాల మీద మీద మాత్రం బాగా ఆసక్తి ఉందంటూ టాలీవుడ్ నటుల గురించి మాట్లాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉఫ్పల్‌ స్టేడియంలో ఆడే ప్రతి మ్యాచ్‌కూ హాజరవుతారంటూ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రస్తావించి.. ఆయనే జట్టు కెప్టెన్ అన్నాడు మురళీధరన్. వెంకీతో తనకు పరిచయం కూడా ఉన్నట్లు తెలిపాడు. మిగతా జట్టు సభ్యుల గురించి మాట్లాడుతూ.. నాని పేరు తెచ్చాడు మురళీధరన్.

నానితో ఒకసారి లక్ష్మణే ఫోన్లో మాట్లాడించాడని.. అతను నటించిన జెర్సీ సినిమా తనకెంతో నచ్చిందని మురళీధరన్ వెల్లడించాడు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌లను పెద్ద స్టార్లుగా పేర్కొంటూ వాళ్లు కూడా జట్టు సభ్యులుగా ఉంటారన్నాడు. మురళీధరన్ శ్రీలంకలో స్థిరపడ్డ తమిళ కుటుంబానికి చెందిన వాడన్న సంగతి తెలిసిందే. అతను పెళ్లి చేసుకుంది కూడా ఓ తమిళ అమ్మాయినే. అయినప్పటికీ ఇలా తెలుగు నటుల పేర్లు, వాళ్లు నటించిన సినిమాల పేర్లను గుర్తు పెట్టుకుని స్టేజ్ మీద ప్రస్తావించడం అంటే విశేషమే.