భగత్ సింగ్ కోసం భలే విలన్

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో విలన్ ఎవరో ఇప్పటిదాకా రివీల్ కాలేదు. ఒరిజినల్ వెర్షన్ తేరిలో ఈ క్యారెక్టర్ ని మహేంద్రన్ అద్భుతంగా పండించారు. గతంలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తనను ఈ పాత్ర కోసం అడిగారని పబ్లిక్ గా ఓ స్టేజి మీద చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ తిరస్కరించడం వేరే సంగతి. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా ఆ ప్రతినాయకుడిని ఖరారు చేసినట్టుగా తెలిసింది. గబ్బర్ సింగ్ కోసం అభిమన్యు సింగ్ ని ఎంచుకుని సక్సెస్ అయిన హరీష్ ఈసారి కూడా ఫ్రెష్ ఫేస్ ని తీసుకొచ్చారు.

వచ్చిన లీకు ప్రకారం ఆ విలన్ తమిళ నటుడు ఆర్ పార్తీబన్. కోలీవుడ్ డైరెక్టర్ గా యాక్టర్ గా ఈయనకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. తెలుగులో చేసింది రామ్ చరణ్ రచ్చ ఒకటే. అది కూడా ఫ్లాష్ బ్యాక్ లో కేవలం కొన్ని సీన్లకు పరిమితమయ్యారు తప్పించి ఆ తర్వాత కనిపించరు. ఫుల్ లెన్త్ కాదు. ఇప్పుడీ ఉస్తాద్ భగత్ సింగ్ లో మాత్రం ఎక్కువ స్పేస్ దొరికేలా హరీష్ శంకర్ డిజైన్ చేశారట. స్ట్రెయిట్ సినిమాలు చేయకపోయినా యముడే నా మొగుడు కాలం నుంచి పార్తీబన్ డబ్బింగ్ చిత్రాలు చూసేవాళ్లకు సుపరిచితుడే. బండ్ల గణేష్ చేసిన డేగల బాబ్లీ ఒరిజినల్ చేసింది ఈయనే

అధికారికంగా చెప్పలేదు కానీ లీక్ మాత్రం నమ్మదగిందే. శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్న ఈ పోలీస్ డ్రామాకు దేవిశ్రీ ప్రసాద్ అందించబోయే సంగీతం మీద భారీ అంచనాలున్నాయి. పుష్ప, వాల్తేరు వీరయ్య, ఉప్పెనలను మించి బ్రహ్మాండమైన ఆల్బమ్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. పవన్ డేట్స్ ఇచ్చేకొద్దీ వేగంగా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న హరీష్ శంకర్ డిసెంబర్ లోగా వీలైతే సినిమా మొత్తం లేదా పవన్ భాగాన్ని గుమ్మడికాయ కొట్టించే సంకల్పంతో ఉన్నాడు. అన్ని సవ్యంగా కుదిరితే సంక్రాంతి రేస్ నుంచి ఏదైనా పెద్దది తప్పుకుంటే దీన్ని దించే ఆప్షన్ వైపు మైత్రి మేకర్స్ చూస్తున్నారట.