బోయపాటి ‘రాజకీయం’ కలకలమేనా?

రాబోయేది ఎన్నికల కాలం. వాటిని లక్ష్యంగా చేసుకుని పూర్తి స్థాయి రాజకీయ సినిమాలే తయారవుతున్నాయి ఓ పక్క. అలా కాకుండా రెగ్యులర్ సినిమాల్లోనూ పొలిటికల్ పంచులు పెట్టడం.. ఒక నాయకుడిని తలపించేలా పాత్రలను సృష్టించడం కూడా జరుగుతుంటుంది. నందమూరి బాలకృష్ణ చివరి చిత్రం ‘వీరసింహారెడ్డి’లో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పెట్టిన కొన్ని డైలాగులు ఎంత చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే. ఈ సినిమాకు హైప్ రావడానికి ఆ డైలాగులు కూడా ఒక కారణమే.

బాలయ్యకు సన్నిహితుడైన దర్శకుడు బోయపాటి శ్రీను సైతం తన సినిమాల్లో పరోక్షంగా జగన్ సర్కారును టార్గెట్ చేస్తుంటాడు. ‘సరైనోడు’ సినిమాలో ఆది పినిశెట్టి చేసిన విలన్ పాత్ర.. జగన్‌ను లక్ష్యంగా చేసుకున్నదే అనే అనుమానాలు బలంగా వినిపించాయి అప్పట్లో. లెజెండ్, అఖండ సినిమాల్లోనూ బోయపాటి రాయించిన కొన్ని డైలాగులు జగన్‌ అండ్ కోకు పరోక్షంగా తగిలాయి.

ఇప్పుడు బోయపాటి నుంచి ‘స్కంద’ మూవీ రాబోతోంది. ఈ సినిమాలో పొలిటికల్ డైలాగులకు కొదవేమీ లేదని సమాచారం. బోయపాటి తెలుగుదేశం పార్టీ మద్దతుదారు అన్న సంగతి తెలిసిందే. అలాగే హీరో రామ్ బంధుగణంలోనూ కొంతమంది టీడీపీలో ఉన్నారు. రామ్ మావయ్య అయిన రమేష్ హాస్పిటల్ అధినేత రామ్‌ను గతంలో జగన్ సర్కారు ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వాన్ని బోయపాటి టార్గెట్ చేస్తూ ఈ సినిమాలో కొన్ని పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగులు పెట్టాడని సమాచారం. ఇందులో ఒక పాత్ర కూడా ఒక నాయకుడిని గుర్తు తెచ్చేలా ఉంటుందట. ఈ పాత్ర.. సినిమాలోని కొన్ని డైలాగులు కచ్చితంగా రాజకీయంగా ఒక చర్చకు తెర తీస్తాయని అంటున్నారు. సినిమా రిలీజ్ ముందు వరకు వాటిని సీక్రెట్‌గానే పెడతారని.. రిలీజ్ అయ్యాక వేడి మొదలవుతుందని అంటున్నారు. చూడాలి ఈ గురువారం ‘స్కంద’ పేల్చే బాంబులేంటో?