ర‌జినీకి క‌థే చెప్ప‌లేద‌ట‌

చంద్ర‌ముఖి అన‌గానే అంద‌రికీ ముందు గుర్తుకొచ్చేది ర‌జినీ పేరే. జ్యోతిక  కూడా అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌రిచినప్ప‌టికీ ర‌జినీ పెర్ఫామెన్స్ అంత సులువుగా మ‌రిచిపోద‌గ్గ‌ది కాదు. సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది ర‌జినీనే అన‌డంలో సందేహం లేదు. ఐతే ఈ సినిమాకు రెండు సీక్వెల్స్ రాగా.. వాటిలో ర‌జినీ న‌టించ‌లేదు. చంద్ర‌ముఖికి కొన‌సాగింపుగా తెలుగులో నాగ‌వ‌ల్లి తీసిన పి.వాసు.. వెంక‌టేష్‌ను హీరోగా ఎంచుకున్నాడు.

ఆ చిత్రం పెద్ద డిజాస్ట‌ర్ అయింది. ఇప్పుడాయ‌న త‌మిళంలో వేరుగా సీక్వెల్ తీశారు. అందులో లారెన్స్ హీరోగా చేశాడు. ఐతే ర‌జినీ లేకుండా చంద్ర‌ముఖి సీక్వెల్ ఏంటి అని పెద‌వి విరుస్తున్న వారే ఎక్కువ‌. కాగా ర‌జినీకి ఈ క‌థ చెబితే ఆయ‌న తిర‌స్క‌రించార‌ని.. దీంతో లారెన్స్‌ను వాసు అప్రోచ్ అయ్యాడ‌ని ఒక ప్ర‌చారం ఉంది.

చంద్ర‌ముఖి-2 తెలుగు ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ప్రెస్ మీట్లో పాల్గొన్న పి.వాసును విలేక‌రులు ఇదే విష‌యం అడిగారు. దీనికి ఆయ‌న బ‌దులిస్తూ.. అస‌లు చంద్ర‌ముఖి-2 స్టోరీ ర‌జినీకి వినిపించ‌నే లేద‌ని.. ఒక్క లైన్ కూడా ఆయ‌న‌కు చెప్ప‌లేద‌ని.. ఇక ఆయ‌న రిజెక్ట్ చేయ‌డం ఎలా జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించారు.

ర‌జినీతో ఈ సినిమా తీయాలంటే ఆయ‌న పాత్ర‌నే కొన‌సాగించాల‌ని.. ఐతే తాను వేరే పాత్ర‌ను సృష్టించి అందుకు త‌గ్గ‌ట్లు క‌థ‌ను అల్లామ‌ని.. అలాంట‌పుడు ర‌జినీ ఈ సినిమా ఎలా చేస్తార‌ని ఆయ‌న అన్నాడు. కొత్త పాత్ర‌ను ఏ హీరో అయినా చేయొచ్చ‌ని.. కాబ‌ట్టే ఇందులోకి లారెన్స్ వ‌చ్చాడ‌ని వాసు తెలిపాడు. ఇక చంద్ర‌ముఖి-2 చివ‌ర్లో మ‌రో సీక్వెల్ కోసం హింట్ ఉంటుంద‌ని.. అవ‌కాశాన్ని బ‌ట్టి చంద్ర‌ముఖి-2 కూడా చేస్తామ‌ని వాసు చెప్పాడు. ఈ సినిమాలో చివ‌రి అర‌గంట ఎంతో ఉత్కంఠ‌భ‌రితంగా ఉంటుంద‌ని వాసు తెలిపాడు.