సలార్ విడుదల తేదీకి కొత్త ప్లాన్ సిద్ధం

ప్రభాస్ అభిమానులు ఈ ఏడాదే సలార్ విశ్వరూపం చూసే ఛాన్స్ దాదాపు లేనట్టే. ఆ మేరకు హోంబాలే ఫిలిమ్స్ తమ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చిందన్న వార్త ట్రేడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. నవంబర్ లేదా డిసెంబర్ తొలుత అనుకున్న మాట వాస్తవమేనని అయితే పోటీతో పాటు సోలో రిలీజ్ దక్కే అవకాశాలు తక్కువగా ఉండటంతో, ఒత్తిడి తీసుకోకుండా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అవ్వాలని ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. అయితే సంక్రాంతికి విడుదల చేసే ఆలోచన మాత్రం నిర్మాతల లిస్టులో లేదట. హఠాత్తుగా అనౌన్స్ చేసి మళ్ళీ ఆ డేట్ కి కట్టుబడకపోతే చాలా సమస్యలు వస్తాయి.

అందుకే ఇవన్నీ పక్కనపెట్టేసి 2024 మార్చి 22 రిలీజ్ డేట్ ని లాక్ చేసే దిశగా ప్రశాంత్ నీల్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఇది ఆర్ఆర్ఆర్ మూడు రోజుల ముందు తేదీ. గత ఏడాది మార్చి 25న వచ్చి ఆస్కార్ దాకా వెళ్ళింది. వేసవి సెలవులకు ముందు వచ్చి పిల్లల పరీక్షలు అయిపోయే నాటికి నిలదొక్కుకుంటే కనకవర్షం కురవడం ఖాయం. అందుకే ఈ ఆప్షన్ నే సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. సలార్ సమస్య కేవలం తెలుగు వెర్షన్ కాదు. ప్యాన్ వరల్డ్ స్థాయి కాబట్టి బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ నుంచి కూడా ఎలాంటి క్లాష్ లేకుండా చూసుకోవాలి. లేదంటే ఓవర్సీస్ స్క్రీన్లు సరిగా దొరకవు.

అక్టోబర్ లో ప్రభాస్ పుట్టినరోజు నాడు ట్రైలర్ వదలడం అనుమానమేనట. ఒకవేళ వచ్చే ఏడాది వెళ్లడం కన్ఫర్మ్ అయితే ఇంత ముందుగా ప్రమోషన్ మొదలుపెట్టడం అనవసరం కాబట్టి ఆ మేరకు ఒక పోస్టర్ తో సరిపుచ్చి కమింగ్ ఇన్ 2024 క్యాప్షన్ పెట్టి సరిపుచ్చుతారు. ఆదిపురుష్ చేసిన గాయం తక్కువ గ్యాప్ లో సలార్ మాన్పుతుందనుకుంటే రివర్స్ ఇంకా పెంచేలా వాయిదాల పర్వం కొనసాగిస్తోంది. కొంత భాగం రీ షూట్ చేయొచ్చనే ప్రచారం కూడా బెంగళూరు వర్గాల్లో ఊపందుకుంది. దర్శకుడో నిర్మాతో ఎవరో ఒకరు  మీడియా ముందుకు వస్తే తప్ప ఈ సస్పెన్స్ తేలే ఛాన్స్ లేదు.