పవన్ స్థాయిలో వరుణ్ మోయగలడా

తమిళ సూపర్ హిట్ మూవీ తేరి ఎప్పుడు చూసినా అంత స్పెషల్ ఏముందబ్బా అనిపిస్తుంది. ఒకటి రెండు ఎపిసోడ్స్ మినహాయించి మిగిలినదంతా రెగ్యులర్ వ్యవహారమే. కాకపోతే సరైన స్టార్ హీరో పడితే తప్ప ఇలాంటి రొటీన్ సబ్జెక్టులను మోయలేరు. అందుకే పవన్ కళ్యాణ్ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక పోలికలు రాకుండా చూసుకునేందుకు దర్శకుడు హరీష్ శంకర్ పెద్ద కసరత్తే చేస్తున్నాడు. మెయిన్ లైన్ తప్ప మిగిలినదంతా తనదైన స్టైల్ లో గబ్బర్ సింగ్ ట్రీట్ మెంట్ ఇచ్చి ఒరిజినల్ తో సంబంధమే లేదనే రేంజ్ లో తీస్తున్నట్టు యూనిట్ నుంచి వస్తున్న అప్డేట్స్.

ప్రైమ్ లో పోలీసోడుగా ఈ సినిమా అందుబాటులో ఉన్నా సరే టీమ్ ధీమాగా ఉంది. సరే పవన్ రేంజ్ స్టార్ రీమేక్ లో ఎక్కువ తక్కువలు ఎన్ని ఉన్నా బ్యాలన్స్ చేస్తాడు. కానీ హిందీలో ఇదే తేరిని వరుణ్ ధావన్ తో కలీస్ దర్శకత్వంలో తీస్తున్నారు. ఆల్రెడీ పావు వంతు షూటింగ్ అయిపోయింది. సమంతా పాత్రకు కీర్తి సురేష్, అమీ జాక్సన్ స్థానంలో వామికా గబ్బిని లాగిస్తున్నారు. ఇక్కడ శ్రీలీల, సాక్షి వైద్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వరుణ్ ధావన్ మాస్ బొమ్మలు చేశాడు కానీ మరీ షారుఖ్ సల్మాన్ రేంజ్ లో స్టార్ డం లేదు. అతనో మార్కెట్ ఉన్న మీడియం రేంజ్ హీరో అంతే.

కానీ ఈ ప్రాజెక్ట్ విషయంలో అట్లీ ధీమాగా ఉన్నాడు. ఎందుకంటే తన నిర్మాణ భాగస్వామ్యంలోనే హిందీ తేరి తీయిస్తున్నాడు. హరీష్ శంకర్ లాగా విపరీతంగా మార్పులు చేయకుండా ఒరిజినల్ వెర్షన్ కే కట్టుబడుతున్నాడని ముంబై టాక్. షారుఖ్ ఖాన్ కి జవాన్ రూపంలో వెయ్యి కోట్ల సినిమా ఇచ్చిన అట్లీ బ్రాండ్ మీద బాలీవుడ్ లో అమాంతం వేల్యూ పెరిగిపోయింది. అతను డైరెక్ట్ చేయకపోయినా కథ స్క్రీన్ ప్లే తనదేనని తెలియడంతో ఆ క్రేజ్ మీద హిందీ తేరికి బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయట. కాకపోతే ఇంత రెగ్యులర్ సబ్జెక్టుని పవన్ అంటే సరేకాని\ వరుణ్ కు మోసేంత సీన్ నిజంగా లేదు. ఏదైనా అద్భుతం జరగాల్సిందే.