ఎనిమిదేళ్లు ఎదురు చూసిన స్టార్ హీరో సినిమా

మాములుగా మంచి మార్కెట్ ఉన్న స్టార్ హీరో సినిమాలకు ఏమైనా అడ్డంకులు వచ్చినా వాళ్ళ రేంజ్ కి తగ్గట్టు ఏదోలా పరిష్కారం అయిపోయి విడుదల చేసుకుంటాయి. అలా కాకుండా సుదీర్ఘ కాలం ల్యాబులో మగ్గితే మాత్రం లేనిపోని అనుమానాలు వస్తాయి. 2016లో మొదలైన విక్రమ్ ‘ధృవ నచ్చత్తిరమ్ చాఫ్టర్ 1 యుద్ధ కాండం’ ఎట్టకేలకు రాబోయే నవంబర్ 24 విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఆ మేరకు ఓ చిన్న టీజర్ రూపంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్ రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో పెళ్లి చూపులు ఫేమ్ రీతూవర్మ హీరోయిన్.

నిజానికీ ప్యాన్ ఇండియా మూవీని ముందు సూర్యతో ప్లాన్ చేసుకున్నారు. అది సాధ్యపడలేదు. దీంతో విక్రమ్ ముందుకొచ్చాడు. ఏడు దేశాల్లో వందల లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. అయితే ప్రొడక్షన్ కాస్ట్ మితిమీరిపోవడంతో నిర్మాత కూడా తనే అయిన గౌతమ్ మీనన్ ఒకదశ దాటాక చేతులు ఎత్తేశారు. ఈలోగా విక్రమ్ కు వరస ఫెయిల్యూర్స్ రావడంతో బయ్యర్లు ఆయన మీద భారీ పెట్టుబడులకు ముందుకు రాలేదు. దీంతో అడ్వాన్సులు తీసుకుని అమ్ముదామనుకున్న గౌతమ్ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఈ కారణం వల్లే ప్రాజెక్టుని పక్కన పెట్టేసి నటుడిగా ఫుల్ బిజీ అయిపోయారు.

తిరిగి ఇన్నేళ్ల తర్వాత ధృవ నచ్చత్తిరమ్ కు మోక్షం దక్కింది. ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, పార్తీబన్, అర్జున్ దాస్, రాధిక శరత్ కుమార్, సలీం బేగ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. హరీష్ జైరాజ్ సంగీతం మరో ఆకర్షణగా నిలుస్తోంది. ఇంత భారీ కాన్వాస్ తో తీసినప్పుడు ముందస్తుగానే సరైన ప్లానింగ్ చేసుకోవాలి. లేకపోతే ఇలాంటి పరిస్థితులే చవి చూడాల్సి వస్తుంది. అయినా ఇంత గ్యాప్ తర్వాత వస్తోంది కాబట్టి ఆడియన్స్ లో ఆసక్తి రేపడం అంత సులభం కాదు. పొన్నియిన్ సెల్వన్ హిట్ కావడంతో విక్రమ్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంది. ధృవ నచ్చత్తిరమ్ ని కాపాడాల్సింది ఇదే.