చిరు అది పక్కన పెట్టేసినట్లేనా?

మెగాస్టార్ చిరంజీవి కొత్తగా చేయాల్సిన సినిమాల్లో చర్చల్లో ఉన్నది ఒక్కటే. అదే.. వశిష్ఠ దర్శకత్వం వహించబోతున్న చిత్రం. ఇది మెగాస్టార్ 157వ చిత్రంగా వార్తల్లోకి వచ్చింది. ‘భోళా శంకర్’ ఆయనకు 155వ సినిమా కాగా.. మధ్యలో 156వ చిత్రంగా వేరే ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్షన్లో సినిమా చేసేందుకు చిరు అంగీకారం తెలపడం.. స్వయంగా ఆయనే ‘భోళా శంకర్’ ప్రమోషన్లలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు కూడా.

కానీ ఆ సినిమా రిలీజ్ తర్వాత కథ మారిపోయింది. రీమేక్ కాదు రీమేక్ కాదు అంటూనే ‘బ్రో డాడీ’నే కళ్యాణ్ అండ్ టీం తెలుగీకరించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. కథ ఎంత మార్చినా కూడా ఇది రీమేక్‌‌ అనే అంటారు జనాలు. ఐతే బ్రో, భోళా శంకర్ రిజల్ట్స్ చూశాక మెగా అభిమానులే రీమేక్ పట్ల ఎంత ఆగ్రహంతో ఉన్నారో చిరుకు బాగానే అర్థమైనట్లుంది.

‘భోళా శంకర్’ రిలీజ్ అయిన వెంటనే పట్టాలెక్కాల్సిన ఈ సినిమా గురించి ఇప్పటిదాకా ఏ కబురూ వినిపించట్లేదంటే.. ఆ సినిమా పక్కకు వెళ్లిపోయినట్లే కనిపిస్తోంది. ఒకవేళ ఈ సినిమా చిరు చేసేట్లయినా సరే.. ఇప్పట్లో కాదన్ని మెగా కాంపౌండ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం చిరు దృష్టంతా వశిష్ఠ మూవీ మీదే ఉంది. ఆయన అక్టోబరు చివర్లో లేదా నవంబర్లో ఈ సినిమాను మొదలుపెట్టేస్తున్నారు.

ఒకసారి మొదలయ్యాక దీన్నుంచి బ్రేక్ తీసుకునే అవకాశాలు లేవంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం చిరు ప్రిపరేషన్లో ఉన్నారు. మరోవైపు కళ్యాణ్ కృష్ణ టీంను మళ్లీ స్క్రిప్టు మీద పని చేయమని చిరు చెప్పాక ఇంతవరకు ఆ కథకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదని తెలుస్తోంది. కాబట్టి వశిష్ఠ తీయబోయేదే చిరు 156వ సినిమా అని ఫిక్సయిపోవచ్చు. కళ్యాణ్ సినిమా 157గా ఉంటుందో లేదా మొత్తంగా ఆ ప్రాజెక్టే క్యాన్సిల్ అయిపోతుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.