సూర్య తొందరపడ్డాడా?

తమిళ స్టార్ హీరోల్లో వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అంటే సూర్యనే. కొత్త తరం స్టార్ మీరోల్లో అతను చేసినన్ని ప్రయోగాలు ఇంకెవరూ చేసి ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఐతే చాలా వరకు విభిన్నమైన కథలతోనే ప్రయాణం చేసే సూర్య.. మధ్య మధ్యలో ఒక మాస్ సినిమా చేస్తుంటాడు. తమిళంలో హరితో అలాగే సినిమాలు చేసేవాడు. ఇప్పుడు సూర్య దృష్టి మన బోయపాటి శ్రీను మీద పడ్డట్లు వార్తలు వస్తున్నాయి.

వీరి కలయికలో సినిమా గురించి కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ కాంబినేషన్లో సినిమా ఓకే అయిందని.. త్వరలోనే ప్రకటన కూడా రాబోతోందని మీడియాలో స్ట్రాంగ్ బజ్ నెలకొంది. బోయపాటి ఇటీవలే చెప్పిన కథకు సూర్య పచ్చ జెండా ఊపినట్లు చెబుతున్నారు. ఐతే సూర్య ఈ ప్రాజెక్టును ఓకే చేసే విషయంలో తొందర పడ్డాడా అనే చర్చ జరుగుతోందిప్పుడు.

ఎందుకంటే బోయపాటి.. నందమూరి బాలకృష్ణతో బ్లాక్‌బస్టర్లు ఇచ్చినప్పటికీ వేరే హీరోలతో అతడికి సరైన విజయాలు లేవు. ‘అఖండ’కు ముందు అతడి సినిమా ‘వినయ విధేయ రామ’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు రామ్‌తో అతను చేసిన ‘స్కంద’ కూడా పెద్దగా బజ్ లేదు. ట్రైలర్ చూసి మెజారిటీ ప్రేక్షకులు పెదవి విరిచారు. బోయపాటి మార్కు మాస్ వేరే హీరోలకు సెట్ కాదేమో అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

బోయపాటి ట్రాక్ రికార్డు, ప్రస్తుత టైమింగ్ ప్రకారం.. సూర్య తొందరపడ్డాడేమో అని మాట్లాడుకుంటున్నారంతా. ‘స్కంద’ రిలీజయ్యే వరకు అతను ఎదురు చూడాల్సిందని.. ఆ సినిమా ఫలితాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సిందని అంటున్నారు. ఐతే నిజంగా అసలు సూర్య బోయపాటి కథకు ఓకే చెప్పాడా.. లేక ‘స్కంద’కు బజ్ పెంచేందుకు  బోయపాటి టీమే ఈ వార్తను ప్రచారంలోకి తెచ్చిందా అనే సందేహాలు కూడా కలుగుతుండటం గమనార్హం.