చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత మారిన రాజకీయ వాతావరణంలో అసెంబ్లీ సమావేశాల్లో అనూహ్యంగా బాలకృష్ణ చూపిస్తున్న దూకుడు ఒకవైపు పార్టీ వర్గాలకు సంతోషాన్ని కలగజేస్తున్నా, ఇంకో పాతిక రోజుల్లో విడుదల కాబోతున్న భగవంత్ కేసరి మీద ఏమైనా ప్రభావం ఉంటుందేమోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ పరిణామాలను మళ్ళీ రిపీట్ చేస్తారేమోనని వాళ్ళ భయం. కానీ బాలయ్య దర్శక నిర్మాతలు ఎలాంటి ఆందోళన చెందటం లేదట. కొంత ప్యాచ్ వర్క్ తప్ప షూటింగ్ మొత్తం ఆల్రెడీ పూర్తయిన సంగతి తెలిసిందే.
భగవంత్ కేసరిని ఏదో ఒకటి చేయాలంటే ఉన్న మార్గాలు రెండే. ఒకటి టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వకపోవడం. రెండు బెనిఫిట్ షోలకు నో చెప్పడం. తెలంగాణలో ఈ సమస్య లేదు. ఎటొచ్చి ఏపీలో బాలయ్య మూవీని ఇబ్బంది పెట్టాలనుకుంటే పై రెండు మార్గాల తప్ప వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ అలా చేయాలనుకుంటే టైగర్ నాగేశ్వరరావు, లియోని కూడా నియంత్రించాలి. అసలు భగవంత్ కేసరి నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ వరకు హైకే అడగకపోవచ్చు. తెల్లవారుఝామున ప్రీమియర్లకు బదులు రెగ్యులర్ అయిదు షోలకే మొగ్గు చూపొచ్చు. టాక్ బాగా వస్తే ఇదసలు సమస్యే కాదు.
సో ఫ్యాన్స్ వర్రీ కావడానికి ఏమీ లేదు. బ్యాలన్స్ ని వీలైనంత వేగంగా పూర్తి చేసి సెన్సార్ కాపీ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తమన్ రీ రికార్డింగ్ జరుగుతోంది. దసరా రేస్ నుంచి తప్పుకోవచ్చనే ప్రచారం జరిగిన నేపథ్యంలో అలాంటి ఛాన్సే లేదని టీమ్ మెంబర్స్ స్పష్టం చేస్తున్నారు. ప్రమోషన్ పరంగా లియో కాస్త దూకుడుగా ఉన్నప్పటికీ పనుల ఒత్తిడి దృష్ట్యా భగవంత్ కేసరి టీమ్ ఇంకా యాక్టివ్ కాలేదు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తగిన వేదికను ఖరారు చేసి ట్రైలర్ కట్ రెడీ చేస్తున్నారు. ఈ లెక్కన పొలిటికల్ హీట్ కి బాలయ్య సినిమాకొచ్చిన ఇబ్బంది లేదు.