సాయం చేసిన దర్శకుడి మీదే బూతులు

సాయి రాజేష్.. ‘బేబి’ సినిమాతో మార్మోగిన పేరిది. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి స్పూఫ్ సినిమాలు చూసి ఈ దర్శకుడి గురించి ఏదో అనుకున్నారు కానీ.. ‘బేబి’తో తన మీద ఉన్న అభిప్రాయాన్నే మార్చేశాడతను. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని యూత్‌కు నచ్చేలా క్రేజీగా తీసి.. బ్లాక్ బస్టర్ విజయాన్నందుకున్నాడు. తన సినిమాల పబ్లిసిటీ అంతా సోషల్ మీడియా వేదికగానే ఎక్కువగా చేస్తుంటాడు సాయి రాజేష్.

ట్విట్టర్‌ను అతను చక్కగా వాడుకుంటాడనే పేరుంది. అలాంటిది ఈ మధ్య ట్విట్టర్లో ఉన్నట్లుండి ఇన్‌యాక్టివ్ అయిపోయాడు. ఇందుక్కారణమేంటో ఒక ఇంటర్వ్యూలో సాయి రాజేష్ వెల్లడించాడు. తన నుంచి సాయం అందుకున్న ఒక వ్యక్తే.. తనను బూతులు తిట్టడంతో ట్విట్టర్‌కు కొంచెం దూరంగా ఉంటుందని భావించి తాను స్లో అయినట్లు అతను వివరించాడు.

ఈ అనుభవం గురించి సాయి రాజేష్ వివరిస్తూ.. ‘‘సోషల్ మీడియా రెండు వైపులా పదును ఉన్న కత్తి. దాన్ని ఎంత వరకు వాడాలో అంత వరకే వాడాలి. ఇక్కడ అభిప్రాయాలు వ్యక్తం చేస్తే ఇబ్బందే. నేను ఒక హీరో సినిమా విషయంలో పెట్టిన పోస్టును చూసి కొందరు నన్ను విమర్శించారు. బూతులు తిట్టారు. ముఖ్యంగా ఒక వ్యక్తి నన్ను తీవ్రంగా తిట్టాడు. ఎందుకలా టార్గెట్ చేసి అసభ్యంగా కామెంట్లు పెడుతున్నాడో తెలుసుకుందామని పర్సనల్ మెసేజ్ పెట్టాను. ఆ క్రమంలో నాకో షాక్ తగిలింది.

తనతో నా పర్సనల్ చాట్ వివరాలు చూస్తే.. కొవిడ్ సమయంలో అనారోగ్యంగా ఉందని, ఆర్థిక సాయం చేయాలని అతను పోస్ట్ పెడితే.. నేను అతడికి నా వంతుగా సాయం చేశా. అప్పుడు తన మైండ్ సెట్ ఏంటో తెలుసుకుందామని.. ‘అప్పుడు నేను సాయం చేశా కదా. ఎందుకు తిడుతున్నావ్’ అని అడిగితే.. ‘దానికీ దీనికీ లింక్ చేస్తున్నావేంటి.. ఇక్కడ అభిమానిని అభిమానిగా చూడాలి. నువ్వు ఆ హీరో ఫ్యాన్. నేను ఈ హీరో ఫ్యాన్. వ్యక్తిగతంగా నీపై ఎప్పుడూ గౌరవం ఉంటుంది’ అని బదులిచ్చాడు. ఈ షాక్ తగిలినప్పటి నుంచి నేను ట్విట్టర్లో యాక్టివ్‌గా లేను’’ అని సాయి రాజేష్ తెలిపాడు.