‘లియో’కు మల్టీప్లెక్స్ షాక్

ఈ ఏడాది లాస్ట్ క్వార్టర్లో భారీ అంచనాలతో రాబోతున్న పెద్ద సినిమాల్లో ‘లియో’ ఒకటి. ఇది తమిళ సినిమానే అయినప్పటికీ.. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగు, హిందీలో కూడా ‘లియో’కు క్రేజ్ తక్కువగా లేదు. ‘విక్రమ్’ తర్వాత నార్త్‌లో కూడా లోకేష్ కనకరాజ్ క్రేజ్ అమాంతం పెరిగిపోగా.. సంజయ్ దత్ విలన్ పాత్ర చేస్తుండటం అక్కడ సినిమాకు మరింత హైప్ వచ్చేలా చేసింది.

కానీ ఈ మల్టీప్లెక్స్ థియేటర్లలో చూసే భాగ్యం హిందీ ప్రేక్షకులకు దక్కేలా లేదు. అందుక్కారణం.. థియేట్రికల్ రిలీజ్‌కు, డిజిటల్ రిలీజ్‌కు మధ్య గ్యాప్ 8 వారాలు లేకపోవడమే. ఈ అంతరం లేని హిందీ చిత్రాలను నేషనల్ మల్టీప్లెక్సులు ప్రదర్శించడం లేదన్న సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘జైలర్’కు కూడా మల్టీప్లెక్సులు నో చెప్పాయి.

ఇప్పుడు ‘లియో’కు సైతం ఈ విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. ఆల్రెడీ ఒక పెద్ద ఓటీటీతో డిజిటల్ డీల్ పూర్తి చేసింది ‘లియో’ టీం. నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. పెద్ద మొత్తంలో డీల్ కుదరడంతో దాన్ని మార్చే పరిస్థితి లేదు. హిందీలో సినిమాకు మంచి క్రేజే ఉన్నప్పటికీ మల్టీప్లెక్సుల్లో వచ్చే ఆ ఆదాయం కోసమని డిజిటల్ డీల్‌ను రివైజ్ చేయాలనుకోవట్లేదు చిత్ర బృందం.

దీంతో హిందీలో ఈ సినిమా కేవలం సింగిల్ స్క్రీన్లలో మాత్రమే రిలీజ్ కాబోతోంది. దసరా కానుకగా అక్టోబరు 19న ‘లియో’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్ రిలీజ్ చేస్తోంది. విజయ్ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా భారీగా వస్తాయని అంచనా వేస్తున్నారు. టాక్ బాగుంటే తెలుగులో విజయ్‌కి ఇది హైయెస్ట్ గ్రాసర్ కూడా కావచ్చు.