శ్రీకాంత్ అడ్డాల.. ఆ జాబితాలో చేరతాడా?

దర్శకులు నటులుగా మారడం కొత్త కాదు. దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్ సహా చాలామంది పెద్ద దర్శకులు నటులుగా మంచి పేరు సంపాదించారు. ఐతే ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. దర్శకులు విలన్ పాత్రలు చేయడం.. అవి భలేగా క్లిక్ అవుతుండటం విశేషం. ముఖ్యంగా తమిళంలో ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది. అక్కడ విలన్ పాత్రలతో బాగా క్లిక్ అయిన డైరెక్టర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు.

సముద్రఖని, గౌతమ్ మీనన్, ఎస్.జె.సూర్య లాంటి దర్శకులు విలన్ పాత్రలతో వారెవా అనిపించారు. ముఖ్యంగా ఇప్పుడు సూర్య ఊపు మామూలుగా లేదు. అతను విలన్ పాత్ర చేస్తే సినిమా బ్లాక్‌బస్టరే అన్న అభిప్రాయం బలపడిపోయింది. తాజాగా ‘మార్క్ ఆంటోనీ’ సినిమాతో మరోసారి ఆ విషయాన్ని రుజువు చేశాడు సూర్య. విలక్షణ దర్శకుడు మిస్కిన్ సైతం విలన్ పాత్రలతో మెప్పిస్తున్నాడు ఈ మధ్య.

ఇప్పుడు తెలుగులో కూడా ఓ దర్శకుడు విలన్ పాత్రతో ఎంట్రీ ఇస్తున్నాడు. అతనే… శ్రీకాంత్ అడ్డాల. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెదకాపు’లో విలన్ పాత్ర చేశాడు శ్రీకాంత్. నిజానికి ఈ పాత్రకు మలయాళ నటుడు సౌభిన్ షాహిర్‌ను అనుకున్నాడు శ్రీకాంత్. కానీ అతను అందుబాటులోకి రాకపోవడంతో తన అసిస్టెంట్ సూచన మేరకు తనే ఆ పాత్ర చేశాడు.

ఈ క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్ ఉన్నది అని ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. నటనకు కొత్త అయినా అలాంటి ఫీలింగ్ ఏమీ రానివ్వకుండా బాగా చేసినట్లున్నాడు అడ్డాల. ట్రైలర్ వరకు ఆ పాత్ర ఆసక్తికరంగా అనిపించింది. డైలాగులు కూడా బాగా కుదిరాయి. ఇక సినిమాలో అతను ఎంతమేర మెప్పిస్తాడో చూడాలి. ఆ క్యారెక్టర్ క్లిక్ అయితే శ్రీకాంత్ కూడా నటుడిగా బిజీ అయిపోయే అవకాశాలున్నాయి. ‘పెదకాపు’ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.