టాలీవుడ్ సీనియర్ నటుల్లో జగపతిబాబు కొంచెం భిన్నమైన వ్యక్తి. ఆయనకు ఇండస్ట్రీలో స్నేహితులు తక్కువే. సినిమా లైఫ్ వేరు.. పర్సనల్ లైఫ్ వేరు అన్నట్లుగా ఉండే ఆయన ఇండస్ట్రీ జనాలతో బయట తిరగడం తక్కువ. బయట వేడుకల్లో, మీడియాలో కూడా పెద్దగా కనిపించరు. వ్యక్తిగత జీవితంలో సింపుల్‌గా ఉండే వ్యక్తులను ఆయన చాలా ఇష్టపడతారు కూడా.
రాజమౌళి కుటుంబంతో పాటు నాగార్జున, ప్రభాస్ లాంటి వాళ్లను ఆయన ఎంతో ఇష్టపడతారు. ప్రభాస్ మీద జగపతికి ఎంత గురి అంటే.. తాను ఒక సందర్భంలో డిప్రెషన్లో ఉంటే ఆదుకున్నది అతనే అని చెప్పడం విశేషం. తాజాగా ఓ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నాడీ సీనియర్ హీరో.
‘‘ప్రభాస్ అందరితోనూ ప్రేమగా ఉండే మనిషి. అతడికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తాడు. నాకు వ్యక్తిగతంగా ప్రభాస్‌తో ఒక అనుభవం ఉంది. నేను ఓసారి డిప్రెషన్లోకి వెళ్లాను. అప్పుడు ప్రభాస్‌కు ఫోన్ చేసి మాట్లాడాలని అడిగా. అప్పటికతను ఓ సినిమా షూటింగ్ కోసం జార్జియాలో ఉన్నాడు. ‘డార్లింగ్ నేను ఉన్నా కదా.. నీ సమస్య చెప్పు. నేను తీరుస్తా’ అని ధైర్యం చెప్పాడు.
అంతే కాదు ఇండియాకు వచ్చాక నన్ను కలిశాడు. నాకంటే చిన్న వాడైనప్పటికీ ఎంతో గొప్ప హృదయం తనది. ఆ సమయంలో అతనిచ్చిన చిన్న ఓదార్పు నాకెంతో ధైర్యాన్నిచ్చింది’’ అని జగపతి తెలిపాడు. ఇక రాజమౌళి కుటుంబం గురించి మాట్లాడుతూ.. ఎన్ని అవార్డులు వచ్చినా.. ఎంత సాధించినా ఆ ఫ్యామిలీలో ఎవ్వరికీ గర్వం ఉండదని… ఒకరో ఇద్దరో కాదని.. అందరూ ఆ కుటుంబంలో అలానే ఉంటారని.. వాళ్ల నుంచి 20 శాతం నేర్చుకున్నా చాలని జగపతి వ్యాఖ్యానించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates