తమిళ సాంబార్ లేపేస్తున్న సునీల్

తంతే బూరెల బుట్టలో పడటం పాత సామెత. సినిమా భాషలో చెప్పాలంటే కొడితే అరవ సాంబార్ మన ఇడ్లిలోకి రావడం కొత్త డెఫినిషన్. హాస్యనటుడిగా పీక్స్ చూసి హీరోగా సక్సెస్ లు కొట్టి తిరిగి ఇప్పుడు సపోర్టింగ్ ఆర్టిస్టుగా మారిపోయిన సునీల్ కి ఇది అక్షరాలా వర్తిస్తుంది. రెగ్యులర్ గా ఆఫర్స్ చేతిలో ఉన్నా మునుపటి రేంజ్ లో సునీల్ హవా టాలీవుడ్ లో ఇప్పుడు లేదు. టైమింగ్ తగ్గడం కావొచ్చు, సత్య లాంటి వాళ్ళు దూసుకురావడం కావొచ్చు కారణం ఏదైతేనేం కొంత వెనుకబడిన మాట వాస్తవం. అనూహ్యంగా తమిళ జనాలు దర్శక నిర్మాతలు ఇతనికి బాగా కనెక్ట్ అవుతున్నారు.

వరస హిట్లు పడటమే ఈ స్పీడ్ కి దారి తీసింది. తాజాగా మార్క్ ఆంటోనీ తమిళనాడు, కేరళలో హిట్టు దిశగా దూసుకుపోతోంది. మనకంతగా ఎక్కలేదు కాదు అక్కడి జనాలు బాగా రిసీవ్ చేసుకున్నారు. జైలర్ లో బ్లాస్ట్ మోహన్ గా చేసింది చిన్న పాత్రే అయినా కీలమైంది కావడంతో రజనీకాంత్ సినిమాలో నటించిన ఆనందంతో పాటు ఇండస్ట్రీ హిట్ లో భాగమయ్యాడు. దీనికన్నా ముందు శివ కార్తికేయన్ మహావీరుడు సైతం కోలీవుడ్ లో కమర్షియల్ సక్సెసే. అందులో మంత్రి పిఎగా చేయడం మంచి గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం తన చేతిలో జపాన్, ఈగై, బులెట్ లు సెట్స్ మీదున్నాయి.

తమిళ డెబ్యూతో మొదలుపెట్టి అన్నీ హిట్లే పడటంతో సునీల్ ని ఒకరకంగా సెంటిమెంట్ గా భావిస్తున్న వాళ్ళు లేకపోలేదు. స్కిన్ టోన్, టైమింగ్ పరంగా తమిళ హాస్య నటులకు దగ్గరగా అనిపించడం అరవ ఆడియన్స్ కనెక్టివిటీని పెంచుతోంది. పైగా డబ్బింగ్ కూడా స్వంతంగా తనే చెప్పుకుంటున్నాడు. పుష్ప 1 తెచ్చిన పేరు ప్రభావం ఇక్కడ పని చేసిందని చెప్పాలి. ఇంత దూకుడు సునీల్ కు తెలుగులో లేకపోవడం గమనించాల్సిన విషయం. గేమ్ చేంజర్, గుంటూరు కారం లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో ఉన్నాడు వాటిలో ప్రాధాన్యం ఎంతుందో రిలీజ్ అయితే కానీ చెప్పలేం.