బంగారం లాంటి అవకాశం బుగ్గిపాలు

సినిమా రిలీజ్ డేట్ల నిర్ణయాలు కత్తి మీద సాము లాంటివి. ఏ మాత్రం అటుఇటు అయినా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈసారి వినాయక చవితి సోమవారం వచ్చింది. ఇలా లాంగ్ వీకెండ్ కలిసిరావడం బాక్సాఫీస్ పరంగా సానుకూలాంశం. అందుకే చాలా ముందస్తుగా ఇలాంటి డేట్లను నిర్మాతలు లాక్ చేసుకుంటారు. కానీ ఈసారి లెక్క తప్పింది. సలార్ వదిలేసిన తేదీ కోసం స్కంద సెప్టెంబర్ 28కి వెళ్లిపోగా దాని వెనుకే చంద్రముఖి 2కి రూటు మార్చి నీతో పోటీ పడాల్సిందేనని తేల్చి చెప్పింది. కట్ చేస్తే తెలుగు ఆడియన్స్ కి మార్క్ ఆంటోనీ తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది.

తమిళంలో మంచి రెస్పాన్స్ ఉన్నప్పటికీ విశాల్ బొమ్మకి ఇక్కడ మాత్రం డివైడ్ టాక్ కొనసాగుతోంది. ఏదో ఒక వర్గం మాస్ మినహాయించి మన జనాలకు అంతగా కనెక్ట్ కాలేదని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. అదే రోజు వచ్చిన చిన్న సినిమాలను పబ్లిక్ అస్సలు పట్టించుకోకపోవడం మరో ట్రాజెడీ. రవితేజ నిర్మించి తన బ్రాండ్ మీద ప్రమోట్ చేసిన చాంగురే బంగారురాజా ఉదయం ఆటకే టపా కట్టేసింది. పెళ్లి చూపులు ఫేమ్ అభయ్ బేతిగంటి అలియాస్ నవీన్ దర్శకుడిగా మారి తానే హీరోగా తీసుకున్న రామన్న యూత్ కి కనీస స్పందన లేదు. సోదర సోదరీమణులారాని పట్టించుకున్న నాథుడు లేడు.

బయట పోస్టర్లు కనిపించడం తప్ప థియేటర్ లోపల జనాలు బొత్తిగా లేని చిన్న సినిమాల వల్ల కనీస ఫీడింగ్ రాలేదని బయ్యర్లు వాపోతున్నారు. ఉన్నంతలో మార్క్ ఆంటోనీనే డీసెంట్ గా కనిపిస్తుండగా తిరిగి జవాన్., మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనూహ్యంగా పుంజుకునేలా ఉన్నాయి. వచ్చే వారం కన్నడ డబ్బింగ్ సప్తసాగరాలు దాటి తప్ప ఇంకేం లేవు. ఒకవేళ స్కంద కనక తప్పుకోక పోయి ఉంటే గణేషుడి పండగతో పాటు ఇంకో అదనపు వారం కలిసొచ్చేది. రామ్ ఇమేజ్, మాస్ ఎలిమెంట్స్, బోయపాటి టేకింగ్ వెరసి టాక్ యావరేజ్ వచ్చినా చాలు వసూళ్లు కుమ్మేసేది. చేతులారా ఛాన్స్ బుగ్గిపాలు చేసుకున్నారు.