‘ఆచార్య’ తేల్చేశాడు.. ‘వకీల్ సాబ్’కు లైన్ క్లియర్

కరోనా పుణ్యమా అని ఈ ఏడాది సినిమాల షెడ్యూళ్లన్నీ తేడా కొట్టేశాయి. ఐదు నెలలుగా కొత్త సినిమాల విడుదల లేదు. షూటింగ్‌లూ ఆగిపోయాయి. దీంతో మార్చి ద్వితీయార్ధం నుంచి షెడ్యూల్ ప్రకారం అనుకున్న ఏ సినిమా రిలీజ్ కాలేదు. భవిష్యత్ ప్రాజెక్టులన్నీ కూడా అటు ఇటు అయిపోయాయి. అంతా అనుకున్న ప్రకారం జరిగితే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’ స్వాతంత్ర్య దినోత్సవానికే విడుదల కావాల్సింది. కానీ షూటింగ్‌కు బ్రేక్ పడటం, థియేటర్లు మూతపడి ఉండటంతో ఈ ఏడాది చివరికి కూడా విడుదల చేసే అవకాశం లేకపోయింది. త్వరలో చిత్రీకరణ మొదలుపెడతారని వార్తలొస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతికి అయినా ఈ సినిమా విడుదలవుతుందేమో అని ఆశపడ్డారు అభిమానులు. కానీ అందుకు అవకాశం లేదని.. శనివారం రిలీజైన మోషన్ పోస్టర్‌ తేల్చేసింది.

‘ఆచార్య’ను వేసవిలో రిలీజ్ చేయబోతున్నట్లు ఈ పోస్టర్లో ప్రకటించేశారు. దీంతో సంక్రాంతి ఆశలకు తెరపడ్డట్లయింది. వచ్చే వేసవికి అధికారికంగా ఖరారైన తొలి భారీ చిత్రం ఇదే మరి. ఇక మిగతా సినిమాల సంగతి తేలాల్సి ఉంది. ‘ఆచార్య’ సైడ్ అయిపోవడంతో ‘వకీల్ సాబ్’కు లైన్ క్లియరైనట్లే. ఈ పవన్ కళ్యాణ్ సినిమా చిత్రీకరణ కొంచెమే మిగిలుంది. ఒక నెల రోజులు చిత్రీకరిస్తే పనైపోతుంది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేసి సంక్రాంతికి విడుదల చేయడానికి అవకాశముంది. కానీ ఈ లోపు థియేటర్లు తెరుచుకోవాలి. ఒకప్పట్లా 100 శాతం ఆక్యుపెన్సీతో నడవాలి. అలా అయితే తప్ప ఈ సినిమా సంక్రాంతికి రాకపోవచ్చు. మరోవైపు ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ను కూడా వేసవిలోనే విడుదల చేయొచ్చని అంటున్నారు. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ సంగతేంటన్నది అయోమయమే. దాని స్కేల్, మిగిలి ఉన్న చిత్రీకరణ ప్రకారం చూస్తే అది వచ్చే ఏడాది ద్వితీయార్దంలో కానీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.