ఏజెంట్ తప్పించుకుంటే భోళా బలయ్యాడు

అనుకున్నట్టే అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిన భోళా శంకర్ నిన్న ఓటిటిలో వచ్చినప్పటి నుంచి ఫ్రెష్ గా ట్రోలింగ్ కి గురవుతోంది. రిలీజైన టైంలో టాక్ కి భయపడి థియేటర్ కు వెళ్లని జనాలు సరే ఇంట్లోనే కదాని నెట్ ఫ్లిక్స్ పెట్టుకుని ఓ షో వేసుకున్నారు. అంతే ఇది ఎంత దారుణంగా ఉందో మొదటి అరగంటకే అర్థమైపోయి ఉండబట్టలేక సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రోలర్స్ సంగతి తెలిసిందే. వెంటనే క్రియేటివిటీకి పదును పెట్టి మీమ్స్, వీడియోల రూపంలో ఇది ఎంత కళా ఖండమో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక్కడ ఏజెంట్ ప్రస్తావనకు కారణముంది. ఇంతే ఫలితముందుకున్న ఈ అఖిల్ బొమ్మ ఇప్పటిదాకా ఓటిటిలో రాలేదు. వస్తుందన్న నమ్మకమూ లేదు. అచ్చం భోళా శంకర్ లాగే బోల్తా పడిన ఈ యాక్షన్ డ్రామా హక్కులు సోనీ లివ్ సంస్థ కొనుగోలు చేసినప్పటికీ ఎందుకనో స్ట్రీమింగ్ చేయకుండా వదిలేసింది. ఇక్కడ చెప్పిన రెండు సినిమాలు అనిల్ సుంకర కు చెందిన ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ వే కావడం విశేషం. ఎంతలేదన్నా వీటి మీద నూటా పాతిక కోట్ల దాకా నష్టపోయినట్టు ట్రేడ్ టాక్ ఉంది. ఈ లెక్కన ఏజెంట్ ట్రోలింగ్ నుంచి తప్పించుకుంటే భోళా బలైపోయింది.

ఇంతే స్థాయిలో పూర్ కంటెంట్ ఉన్న రామబాణం సైతం వచ్చేసింది కానీ దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కరోనా టైంలో ఏమో కానీ ఇప్పుడు మాత్రం ఓటిటి సంస్థలు సినిమాలు కొనే విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉంటున్నాయి. నిర్మాతలు చెప్పిన రేట్లకు గుడ్డిగా కొనడం లేదు. ఆ కారణంగానే 2023లో థియేటర్ రిలీజ్ జరుపుకున్న సుమారు యాభైకి పైగా మీడియం, చిన్న చితక సినిమాలు డిజిటల్ మోక్షం కోసం ఎదురు చూస్తున్నాయట. ఓటిటి రైట్స్ తో గట్టెక్కుతామనే లెక్కలో ఉన్న ప్రొడ్యూసర్లకు క్రమంగా జ్ఞానోదయం అవుతోంది. క్వాలిటీ మెరుగు పడేందుకు ఇదీ ఒకందుకు మంచిదే.