కళ్యాణ్ రామ్ ఎలా సైలెంట్‌గా ఉన్నాడు?

నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం ‘డెవిల్’ నిన్నట్నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నిన్ననే ఈ సినిమా నుంచి రాబోతున్న కొత్త పాట గురించి అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా గురించి చర్చ జరగడానికి కారణం ఆ పాట కాదు. ఆ పాట గురించి వెల్లడిస్తూ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్. ఆ పోస్టర్ మీద దర్శకుడిగా అభిషేక్ నామా పేరు ఉండటం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ సినిమా మొదలైనపుడేమో దర్శకుడిగా నవీన్ మేడారం పేరుంది.

కానీ టీజర్ లాంచ్ అయినపుడు డైరెక్టెడ్ బై ‘అభిషేక్ నామా పిక్చర్స్ టీం’ అని వేశారు. కానీ ఇప్పుడేమో అభిషేక్ నామానే దర్శకుడైపోయాడు. ఇప్పటిదాాకా రైటింగ్, డైరెక్షన్‌లో ఎలాంటి అనుభవం లేని నిర్మాత.. ఉన్నట్లుండి ఎలా దర్శకుడు అయిపోయాడో జనాలకు అర్థం కావడం లేదు. దర్శకుడితో నిర్మాతకు విభేదాలు తలెత్తితే.. అతణ్ని తప్పించి మరొకరిని పెట్టిన ఉదంతాలు లేకపోలేదు. కానీ ఇలా నిర్మాతే దర్శకుడు అయిపోవడం అరుదైన విషయం.

ఐతే నవీన్‌తో అభిషేక్ వ్యవహరించిన తీరు పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇదేదో చిన్నా చితకా సినిమా అయితే ఓకే కానీ.. పెద్ద బడ్జెట్లో, కళ్యాణ్ రామ్ లాంటి పేరున్న హీరో చేసిన సినిమా కావడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. దర్శకుడికి, నిర్మాతకు మధ్య గొడవేంటో ఏమో కానీ.. తన సినిమా ఇలా నెగెటివ్ న్యూస్‌లతో వార్తల్లో నిలుస్తుంటే కళ్యాణ్ రామ్ ఏం చేస్తున్నాడన్నది ప్రశ్న. ‘డెవిల్’ సినిమాకు సంబంధించి నవీన్ కంట్రిబ్యూషన్ ఏంటో ఈ నందమూరి హీరోకు తెలిసే ఉంటుంది.

ఇలా దర్శకుడి పట్ల అవమానకరంగా వ్యవహరించి.. నిర్మాత దర్శకుడిగా తన పేరే వేసుకుంటుంటే కళ్యాణ్ రామ్ ఎలా అనుమతించాడన్న సందేహాలు కలుగుతున్నాయి. నిజంగా అభిషేకే ఈ సినిమాకు కర్త, క్రియ అయితే ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. కానీ వేరొకరి క్రెడిట్‌ను తాను తీసుకుంటుంటే మాత్రం కళ్యాణ్ రామ్ ప్రశ్నించాల్సిందే. ఈ విషయంలో వివాదానికి తెరదించడమే కాక.. ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కళ్యాణ్ రామ్ మీద ఉందనడంలో సందేహం లేదు.