తెలుగు రాష్ట్రాల వరకు రీ రిలీజుల ట్రెండ్ ఎంత ఉధృతంగా ఉందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. అప్పట్లో డిజాస్టర్లు అనిపించుకున్నవి కూడా ఇప్పుడు నిర్మాతలకు కనక వర్షం కురిపిస్తున్నాయి. ఆరంజ్ విషయంలో ఏం జరిగిందో చూశాం. ఇక బ్లాక్ బస్టర్ల సంగతి సరేసరి. పోకిరితో మొదలుపెట్టి మన్మథుడు దాకా అన్నీ వసూళ్ల మోత మోగించినవే. వచ్చే వారం రాబోతున్న 7జి బృందావన్ కాలనీకు ఆల్రెడీ హడావిడి షురూ చేశారు. తాజాగా ఈ జాబితాలోకి దగ్గుబాటి రానా డెబ్యూ మూవీ లీడర్ చేరబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఫిబ్రవరిలో 4కె సాంకేతికత జోడించి పునఃవిడుదల చేసేందుకు ప్లాన్ చేస్తారట.
పదమూడేళ్ల క్రితం 2010 ఫిబ్రవరి 19న లీడర్ వచ్చింది. సుప్రసిద్ధ ఏవిఎం, సురేష్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఎమోషనల్ సినిమాలు మాత్రమే తీస్తాడని పేరున్న శేఖర్ కమ్ముల మొదటిసారి ఒక పొలిటికల్ సబ్జెక్టు అందులోనూ స్టార్ కిడ్ ని లాంచ్ చేయడానికి తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోతే ఆ కుర్చీ కోసం కొడుకు చుట్టూ పన్నే పద్మవ్యూహం నుంచి అతనెలా తప్పించుకుని సిఎం అయ్యాడనే పాయింట్ మీద దీన్ని రూపొందించారు. వైఎస్ మరణాన్ని ఆధారంగా చేసుకుని అల్లారనే టాక్ కూడా అప్పట్లో వినిపించింది.
త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో లీడర్ ని రీ రిలీజ్ చేయబోవడం ఆసక్తి కలిగించే విషయం. ఎందుకంటే అధికార పార్టీకి చురకలు వేసే ఉద్దేశంతో నారా రోహిత్ ప్రతినిథి 2తో వస్తున్నాడు. జనవరి నెలాఖరుని ఫిక్స్ చేసుకున్నారు. ఆపై ఫిబ్రవరిలో దర్శకుడు మహి వి రాఘవ్ హీరో జీవా రూపొందిస్తున్న జగన్ బయోపిక్ యాత్ర 2 రానుంది. వీటి మధ్యలో లీడర్ దిగడం ఆసక్తి కలిగించే విషయమే. లీడర్ బ్లాక్ బస్టర్ కానప్పటికీ ఇప్పుడు చూసినా వర్తమాన రాజకీయాలకు సంబంధించిన ఎన్నో అంశాలు స్పృశించినట్టే అనిపిస్తుంది. రానా ఎన్ని సినిమాలు చేసినా లీడర్ బెస్ట్ డెబ్యూగా మిగిలిపోయింది.