మాదకద్రవ్యాల వినియోగం గురించి పోలీసులు పట్టుకుంటున్న కేసులు ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువయ్యాయి. రోజూ లక్షల వ్యాపారం చేసే టిఫిన్ సెంటర్ యజమానే ఈ భాగోతంలో దొరికిపోవడం పెద్ద రాద్ధాంతానికి దారి తీసింది. హైదరాబాద్ లో ఈ జాడ్యం చాప కింద నీరులా పాకిపోతోంది. దీనికి బేబీ సినిమాకు కనెక్షన్ ఏంటనుకుంటున్నారా. ఇటీవలే పట్టుబడిన ఒక డ్రగ్స్ కేసుకు సంబంధించి నిర్వహించిన ప్రెస్ మీట్ లో సిటీ పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ బేబీలో చూపించిన పలు సన్నివేశాల గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ సదరు దర్శక నిర్మాతలకు అడ్వైజరీ నోటీసులు ఇచ్చామని చెప్పారు.
విషయం ఏంటంటే బేబీలో వైష్ణవి చైతన్య కాలేజీలో కొత్తగా చేరినప్పుడు స్నేహితురాలు సీత సిగరెట్ ద్వారా డ్రగ్స్ ని తీసుకునే క్రమాన్ని దేవరాయ పాటలో చూపిస్తుంది. అందులోనే మరో సీన్ విరాజ్ అశ్విన్ స్నేహితుడు హుక్కా ద్వారా వాటిని సేవించడం చూపిస్తారు. వీటిని వీడియోతో సహా ప్రెస్ మీట్ లో ప్లే చేసిన ఆనంద్ తాము పట్టుకున్న అపార్ట్ మెంట్ కేసులో ఇలాంటివే పట్టుబడ్డాయని, మేకర్స్ ఈ తరహా సీన్లు పెట్టేటప్పుడు బాధ్యతగా ఉండాలని హితవు పలికారు. కథ ప్రకారమే చూపించి బయట జరుగుతున్నదేనని సమర్ధించుకోవడానికి లేదని తప్పొప్పులు మనమే తెలుసుకోవాలని చెప్పారు.
సెన్సార్ జరిగిపోయి థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న బేబీకి ఇప్పుడు దీని వల్ల వచ్చే డ్యామేజ్ ఏమీ లేదు కానీ ఇకపై సినిమాలు తీసే క్రమంలో రచయితలు దర్శకులు సివి ఆనంద్ చెప్పిన సూచనలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మూవీ ద్వారా జనాలు మంచి నేర్చుకోకపోవచ్చు కానీ చెడు త్వరగా పాకే అవకాశం ఉందనే కామెంట్ ని కొట్టిపారేయలేం. అయితే పబ్లిక్ ఎంత వరకు నెగటివ్ అంశాల పట్ల ప్రభావితం అవుతారనేది మాత్రం ఎవరూ ముందస్తుగా ఊహించలేరు. మొత్తానికి ఓటిటిలో వచ్చాక బేబీ ఇలా హాట్ టాపిక్ గ మారడం ఉహించని విషయం. ఇప్పుడీ టాపిక్ వైరల్ అవుతోంది.