సంజు మీద 700 కోట్ల రిస్క్

బాలీవుడ్లో మాంచి డిమాండ్ ఉన్న హీరోల్లో సంజయ్ దత్ ఒకడు. అతడితో సినిమా చేయడానికి ఎప్పుడూ దర్శకులు, నిర్మాతలు లైన్లో ఉంటారు. కానీ కమిట్మెంట్ తీసుకున్నాక సంజు ఎప్పుడు అందుబాటులో లేకుండా పోతాడో తెలియదు. రకరకాల కారణాలతో గత మూడు దశాబ్దాల్లో అతడి కెరీర్లో పలుమార్లు బ్రేక్స్ వచ్చాయి. అనేక కేసుల్లో చిక్కుకుని జైలుకు వెళ్లడం వల్ల వేర్వేరు సందర్భాల్లో సంజయ్ దత్ సినిమాలు డోలాయమానంలో పడ్డ సంగతి తెలిసిందే.

ఈ అడ్డంకులన్నీ అధిగమించి కొన్నేళ్ల కిందటే ఫ్రీ బర్డ్ అయ్యాడు సంజు. ఇక అప్పట్నుంచి వరుసబెట్టి భారీ చిత్రాలు చేస్తున్నాడు. రీఎంట్రీ తర్వాత ఎప్పుడూ అరడజనుకు తక్కువ కాకుండా సినిమాలు చేతిలో ఉంచుకున్నాడు. ఐతే ఇప్పుడు ఎవ్వరూ ఊహించని కష్టం వచ్చింది సంజుకు. అతడికి ఊపిరితిత్తుల క్యాన్సర్ అని.. అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉందని ఇటీవలే వెల్లడైంది.

దీంతో సంజును నమ్ముకున్న నిర్మాతలందరూ తీవ్ర ఆందోళనలో పడిపోయారు. సంజు ఆరు సినిమాలకు కమిట్మెంట్లు ఇచ్చి ఉన్నాడు. అందులో కొన్ని చిత్రీకరణ మధ్య, చివరి దశల్లో ఉణ్నాయి. కొన్ని సినిమాలు ఇంకా మొదలు కావాల్సి ఉంది. ఇప్పుడు సంజు అనారోగ్యం పాలవడంతో రూ.700 కోట్ల మొత్తం రిస్క్‌లో పడింది. అందులో పృథ్వీరాజ్, షంషేరా, కేజీఎఫ్-2, యశ్ రాజ్ ఫిలిమ్స్ మూవీ లాంటి క్రేజీ ప్రాజెక్టులున్నాయి.

ముఖ్యంగా ‘కేజీఎఫ్-2’ టీం పరిస్థితే అయోమయంగా ఉంది. ఆ సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తయింది. క్లైమాక్స్, మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణ చేయాల్సి ఉంది. ఈ నెల 26 నుంచి కొత్త షెడ్యూల్ మొదలుపెడుతున్నారు. అందులో సంజుతో సంబంధం లేని సన్నివేశాలు తీయబోతున్నారు. ఆ తర్వాత అతడితో ముడిపడ్డ సీన్స్ మాత్రం పక్కన పెడుతున్నారు.

ఈ ఏడాది అయితే సినిమా విడుదలయ్యే అవకాశం లేదు కాబట్టి ఇంకో నాలుగైదు నెలలైనా సంజుకోసం ఎదురు చూడొచ్చు. కానీ అప్పటికైనా అతను అందుబాటులోకి వస్తాడా లేదా అన్నది సందేహం. ప్రస్తుతానికి ముంబయిలోనే చికిత్స తీసుకుంటున్న సంజు.. త్వరలోనే అమెరికాకు వెళ్లనున్నాడు.