మూడు రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఏఆర్ రెహమాన్ లైవ్ మ్యూజికల్ కన్సర్ట్ తాలూకు వివాదం కొత్త మలుపులు తీసుకుంటూనే ఉంది. ఆదిత్యారామ్ ప్యాలెస్ లో నిర్వహించిన ఈవెంట్ కు వచ్చిన వేలాది అభిమానులు చేతిలో టికెట్లున్నా కూడా లోపలి వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో తీవ్ర నిరాశతో ఇంటికి తిరుగు ముఖం పట్టారు. అంతే కాకుండా నిర్వాహకుల నిర్వహణ లోపాల వల్ల స్టేడియం చుట్టుపక్క పరిసరాల్లో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడి గంటల తరబడి వాహనాలు మెయిన్ రోడ్డు మీద నిలిచిపోయాయి. వీటిలో ఏకంగా సీఎం స్టాలిన్ కాన్వాయ్ కూడా ఉందని మీడియా టాక్.
స్వయంగా ఏఆర్ రెహమనే సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పే దాకా వ్యవహారం వెళ్ళింది. అప్పటికే విపరీతమైన ట్రోలింగ్ తో తండ్రి ఇమేజ్ కి భంగం కలిగిందని గుర్తించిన కూతురు ఖతీజా పలు సాక్ష్యాలతో రెహమాన్ గతంలో ఏ విధంగా మంచి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేసేవారో వివరాలతో సహా పోస్ట్ చేయడం వైరలయ్యింది. అయితే పోలీసుల దగ్గర కేవలం 20 వేలకు మాత్రమే అనుమతి తీసుకుని 41 వేల టికెట్లు అమ్మారనే తాజా అభియోగం ఏఏటిసి నిర్వాహకుల మీద సాక్ష్యం రూపంలో దొరకడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ఈ ఇష్యూలో ముగ్గురు పోలీస్ అధికారులు బదిలీ అయ్యారట. ఇదంతా స్కామ్ 2023గా ఫ్యాన్స్ అభివర్ణిస్తున్నారు.
ఇది బయట పడక ముందు ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు ఈవెంట్ ఆర్గనైజర్ తమ తప్పేమి లేదన్న తరహాలో దబాయిస్తూ మాట్లాడ్డం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో గంటల వ్యవధిలోనే తప్పు మాదేనంటూ ఒప్పుకున్న మరో వీడియోని రిలీజ్ చేశారు. ఈ వ్యవహారంలో రెహమాన్ తప్పు లేకపోయినా వేళ్ళన్నీ ఆయన వైపే వెళ్తున్నాయి. మిస్ చేసుకున్న వాళ్లకు రీ ఫండ్ చేస్తామనే హామీ ఇచ్చారు కానీ వేడుక దగ్గర జరిగిన సంఘటనల వల్ల వేలాది అభిమానులు మనస్థాపానికి గురయ్యారు. ఇండియాస్ బిగ్గెస్ట్ సోల్డ్ అవుట్ లైవ్ ఈవెంట్ కి ఇలా జరగడం విచారం విషాదకరం.