చావు కబురు ఇంత చల్లగా చెబుతారా

గత పది రోజులుగా ప్రపంచమంతా కోడై కూస్తోంది. ఇతర సినిమాల తెలుగు తమిళ హిందీ నిర్మాతలు అప్పటికప్పుడు తమ రిలీజ్ డేట్లను మార్చుకునే ప్రయాసలో అష్టకష్టాలు పడ్డారు. ఇదంతా సలార్ వాయిదా వల్లేనని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం అనధికార సమాచారమే ఇంత రాద్ధాంతం చేసినా అసలు కారకులు హోంబాలే ఫిలింస్ మాత్రం ఇప్పటిదాకా స్పందించలేదు. తీరా చూస్తే ఇవాళ వాయిదా గురించి చావు కబురుని చాలా చల్లగా చెప్పారు. పోనీ కొత్త రిలీజ్ డేట్ ఏమైనా పొందుపరిచారా అంటే అదీ లేదు. కమింగ్ సూన్ అన్నారు కానీ దానికి అర్థం పరమార్థం ఎవరికీ తెలియదు.

పోస్ట్ పోన్ కారణాలు అందరు చెప్పినట్టే ఉన్నాయి.  అసౌకర్యానికి చింతిస్తున్నామని, బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తామని హామీ ఇస్తూ ఒక టెంప్లేట్ మెసేజ్ ని పెట్టారు. పనులు చివరి దశలో ఉన్నాయని చెప్పారు కానీ అవి ఎప్పుడు పూర్తవుతాయనే క్లారిటీ మాత్రం లేదు. ఇది కూడా ఫ్యాన్స్, మీడియా వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టు ఉంది తప్ప విడుదల తేదీ విషయంలో ఎలాంటి కంక్లూజన్ కి రాలేకపోతున్న మాట వాస్తవం. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్, సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఇద్దరూ ట్రైలర్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ చూసుకుంటున్నారు.

సలార్ కున్న అతి పెద్ద సమస్య ఏ నెలలో రావాలనేదే. జనవరి అయితే బెటరని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎప్పటి నుంచో ఆ సీజన్ ని లాక్ చేసుకున్న ఇతర స్టార్ హీరోలకు ఇబ్బంది కావడంతో పాటు సలార్ కు సైతం ఓపెనింగ్స్ పరంగా సమస్యలు వస్తాయి. సోలో రిలీజ్ అయితే ప్రభాస్ ఫుల్ చేసే స్థాయి పెద్దగా ఉంటుంది. ఆదిపురుష్ డిజాస్టరైనా సరే మొదటి నాలుగు రోజులు ముప్పాతిక పెట్టుబడి వెనక్కు తెచ్చిందంటే దానికి కారణం కాంపిటీషన్ ఎవరూ లేకపోవడమే. అందుకే సలార్ ఈ లెక్కలన్నీ వేసుకునే క్రమంలో ఆలస్యం చేయడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది.