కొన్నేళ్లుగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది మైత్రీ మూవీ మేకర్స్. సినిమాల సంఖ్య, రేంజ్ పరంగా చూస్తే నంబర్ వన్ స్థానానికి గట్టి పోటీలో ఉందా సంస్థ. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి లాంటి టాప్ స్టార్లకు వసూళ్ల పరంగా వారి వారి కెరీర్లలో బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చిన ఘనత మైత్రి సంస్థకు చెందుతుంది. ఇలాంటి ట్రాక్ రికార్డున్న సంస్థకు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో మాత్రం సింక్ కావట్లేదు.
ఈ హీరోతో మూడు చిత్రాలు లైన్లో పెడితే మూడూ చేదు అనుభవాన్నే మిగిల్చాయి. ముందుగా విజయ్‌తో చేసిన ‘డియర్ కామ్రేడ్’ మైత్రీ వాళ్లకు భారీ నష్టాలే మిగిల్చింది. ఇది మంచి సినిమానే అయినా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టరే అయింది. ఈ సినిమా ప్రొడక్షన్ చివరి దశలో ఉండగానే విజయ్‌తో ‘హీరో’ అనే సినిమాను మొదలుపెట్టింది మైత్రీ సంస్థ. కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్సులు తీశాక.. ఏదో తేడాగా అనిపించి సినిమాను ఆపేశారు. అప్పటికే కొన్ని కోట్లు ఖర్చు అయినప్పటికీ.. సినిమా మొత్తం తీసి నిండా మునగడం కంటే ఆ నష్టం చాలనుకున్నారు.
ఇలా మైత్రీ వాళ్లు తన సినిమాలతో దెబ్బ తినడంతో వారికి మరో సినిమా చేయాలనుకున్నాడు విజయ్. అలా సెట్ అయిందే.. ఖుషి. శివ నిర్వాణ లాంటి ప్రామిసింగ్ డైరెక్టర్ సినిమా కావడంతో ‘ఖుషి’పై మంచి అంచనాలే నెలకొన్నాయి. పాటలు సూపర్ హిట్ అయి సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చాయి. కానీ సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో వీకెండ్ తర్వాత బోల్తా కొట్టింది.
ఒక్క యుఎస్‌లో మాత్రమే సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. నైజాంలో కొంత నష్టం తప్పలేదు. ఏపీలో అయితే బయ్యర్లకు బాగానే చేతులు కాలాయి. సినిమాను మంచి లాభాలకే అమ్మినప్పటికీ.. తమ రెగ్యులర్ బయర్లకు కొంతమేర సెటిల్ చేయాల్సి వస్తోంది మైత్రీ అధినేతలు. తర్వాతి సినిమాలతో సర్దుబాటు చేయబోతున్నారు. మొత్తానికి విజయ్‌తో మైత్రీ వారికి అన్నీ చేదు అనుభవాలే మిగిలిన నేపథ్యంలో ఇంకోసారి ఈ కలయికలో సినిమా రాకపోవచ్చు.