మలయాళంలో వచ్చిన బ్లాక్ బస్టర్లన్నీ ఇక్కడా అదే స్థాయి ఫలితాలు అందుకుంటాయన్న గ్యారెంటీ లేదు. ఆడియన్స్ అభిరుచుల్లో ఉన్న తేడా కారణంగా వీటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అందుకే కేరళలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన లూసిఫర్ ని ఏకంగా చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసుకున్నా జస్ట్ యావరేజ్ ఫలితమే వచ్చింది. అయ్యప్పనుం కోశియుమ్ అక్కడ ల్యాండ్ మూవీగా నిలిచిపోతే ఇక్కడ పవన్ రానా కాంబినేషన్ హిట్ స్థాయి దాటి పైకి తీసుకెళ్లలేకపోయింది. వీటిలో కమర్షియల్ ఫ్లేవర్ బాగా తగ్గిపోవడమే ఈ ఫలితాలకు ప్రధాన కారణం.
అందుకేనేమో కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ దర్శక నిర్మాతలు వెరైటీ స్ట్రాటజీని అందుకున్నారు. 2021లో వచ్చి విమర్శల ప్రశంసలు, వసూళ్లు రెండూ అందుకున్న నయట్టుని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తేజ మర్ని దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ జరుగుతుండగానే టీమ్ ప్రమోషన్లు మొదలుపెట్టింది. లింగి లింగి లింగిడి అంటూ శ్రీకాకుళం యాసలో సాగే ఫక్తు మాస్ సాంగ్ ని కంపోజ్ చేయించి దాన్ని ప్రధాన తారాగణం మీద షూట్ చేశారు. ఇటీవలే లిరికల్ వీడియో వచ్చింది. దీని మీద సోషల్ మీడియా రీల్స్, పోస్టులు కూడా వచ్చేస్తున్నాయి.
నిజానికి నయట్టు చాలా సీరియస్ సినిమా. ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఒక కేసులో ఇరుక్కుంటే స్వంత డిపార్ట్ మెంట్ నుంచే తప్పించుకునే పరిస్థితి తలెత్తుతుంది. మంచి థ్రిల్లర్ టైపులో సాగుతుంది. దాంట్లో ఇలా మాస్ సాంగ్ కి ఛాన్సే లేదు. అయినా పెట్టారంటే మక్కికి మక్కి దించకుండా మన ప్రేక్షకులకు తగ్గట్టే తీయాలనే ఆలోచన కనిపిస్తోంది. ఇది కరెక్ట్ గా సింక్ అయితే పర్వాలేదు కానీ ఏ మాత్రం అటు ఇటు అయినా తేడా వస్తుంది. జోహార్ లాంటి పొలిటికల్ డ్రామాని మెప్పించేలా తీసిన తేజ మర్ని ఇందులో పొరపాట్లకు అవకాశం కల్పించకపోవచ్చు. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.