రెడీ అయిన సినిమాలన్నీ ఓటిటి రిలీజ్ బాట పడుతోంటే… రామ్ పోతినేని ‘రెడ్’ మాత్రం థియేటర్లు తెరిచే వరకు వేచి చూడనుంది. సొంత నిర్మాణ సంస్థలో తీయడం వల్ల నిర్మాత వైపు నుంచి రామ్‌కి ఒత్తిడి లేదు. పైగా ఈ చిత్రం హిందీ, తెలుగు శాటిలైట్ రైట్స్ భారీ రేట్‌కి అమ్మేసారు. దీంతో ఆర్థిక పరమైన ఒత్తిడి కూడా లేదు. నిర్మాత స్రవంతి రవికిషోర్‌కి పలు ఓటిటి సంస్థల నుంచి ఆకర్షణీయమయిన ఆఫర్లు రాగా, రామ్ మాత్రం థియేట్రికల్ రిలీజ్ చేయాల్సిందేనని పట్టుబట్టాడట. రామ్ ఇలా పట్టు పట్టడానికి కూడా ఒక కారణముంది. అతనికి ‘ఇస్మార్ట్ శంకర్’తో మాస్ ఫాలోయింగ్ వచ్చింది. దానిని ‘రెడ్’ మరింత పటిష్టం చేస్తుందని అతని నమ్మకం. అదీ కాక నానికి ‘టక్ జగదీష్’ రెడీగా వున్నట్టు రామ్‌కి మరో సినిమా సిద్ధంగా లేదు.
అందుకే ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేసి, మరో సినిమా కోసం మరో ఏడాది వరకు వేచి చూడడం దేనికని రామ్ ఈ చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని తన పెదనాన్నకు ఖరాఖండీగా చెప్పేసాడట. ఈ చిత్రానికి రామ్‌కి ప్రత్యేకించి పారితోషికం లేదు. లాభాల్లో వాటాదారుడు కనుక అతను కాదంటే రెడ్ ఓటిటిలో వచ్చే ఛాన్సే లేదు. ఇదిలావుంటే ఇంకా పది, ఇరవై రోజుల షూటింగ్ బాకీ వున్న సినిమాల హక్కులను కూడా ఓటిటి సంస్థలు చేజిక్కించుకుంటున్నాయి. థియేటర్లు తెరిచినా కానీ ఓటిటి ద్వారా కొన్ని సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నాయి.