మాములుగా ఒక కొత్త సినిమా థియేటర్లలో ఆడేసి వెళ్ళిపోయాక ఓటిటి కోసం ఎదురు చూడటం సహజం. ఏడాదికి సరిపడా చందా కట్టినప్పుడు అందులోనే అన్ని వచ్చేస్తాయని కస్టమర్లు అనుకుంటారు. కానీ అమెజాన్ ప్రైమ్ మాత్రం దీనికి భిన్నంగా క్రేజ్ ఉన్న వాటిని రెంటల్ పద్దతిలో వీలైనంత సొమ్ములు చేసుకోవాలని చూస్తోంది. బాలీవుడ్ మూవీ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని ఫైనల్ రన్ ఆల్రెడీ అయిపోయింది. జవాన్ వచ్చాక ఇక ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో పెద్ద తెరపై మిస్ అయినవాళ్లు ఇంట్లో చూసుకోవచ్చని ఎదురు చూశారు. ఆ టైం రానే వచ్చింది.
ట్విస్ట్ ఏంటంటే రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని చూడాలంటె అక్షరాలా 349 రూపాయలు చెల్లించాలి. అది కూడా ఒక్కసారి మొదలుపెట్టాక నలభై ఎనిమిది గంటల్లో పూర్తి చేయాలి. లేదంటే ఎక్స్ ఫైర్ అయిపోతుంది. మీరు సంవత్సర డబ్బులు చెల్లించినా సరే ఇప్పుడు మాత్రం ఎక్స్ ట్రా భరించక తప్పదు. నిజానికి ఈ పద్ధతిని కెజిఎఫ్ 2 నుంచే ప్రైమ్ అమలులోకి తీసుకొచ్చింది. కానీ ఇతర దేశాల్లో ఉన్నంత స్పందన ఇండియాలో లేకపోయినా అలవాటు చేసేందుకు విడిగా స్టోర్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. దీంట్లో కొన్ని హాలీవుడ్ క్లాసిక్స్ సైతం డబ్బులిచ్చి చూడాల్సిందే.
అలా అని ఎక్కువ కాలం కాదు. ఓ వారం పదిరోజులు అయ్యాక సబ్స్క్రైబర్స్ కు ఫ్రీగా పెట్టేస్తారు. అప్పటిదాకా ఆత్రం అంచుకుకోలేని వాళ్ళు మాత్రం పర్సుకి పని చెప్పాలన్న మాట. ఇంకా నయం జైలర్ ని కూడా ఇలాగే ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. రెవిన్యూ కోణంలో దీని వల్ల అదనపు ఆదాయం ఉన్నా కూడా పైరసీ వీరులు వీటిని కూడా వదిలిపెట్టడం లేదు. ఉచితంగా తమ సైట్లలో హెచ్డిని అందుబాటులో ఉంచేస్తున్నారు. అలాంటప్పుడు ఈ నిర్ణయాలు అలోచించి తీసుకుంటే బాగుంటుంది. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ తో సహా మిగిలిన ఏ ఓటిటిలో ఈ మోడల్ లేకపోవడం గమనించాల్సిన విషయం.