ఇంతటి విధ్వంసంలోనూ ప్రభాస్ వెనుకే

జవాన్.. జవాన్.. జవాన్.. కొన్ని రోజులుగా భారతీయ సినిమా ప్రేమికుల చర్చలన్నీ ఈ సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. ‘పఠాన్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన సినిమా కావడం.. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేయడం.. ట్రైలర్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఉండటంతో ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తేనే ఈ సినిమా వసూళ్ల మోత మోగించడం ఖాయమని అర్థమైంది. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా అన్ని హిందీ చిత్రాల రికార్డులనూ ఇది బద్దలు కొట్టేసింది.

తొలి రోజు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు మరింతగా సినిమా చూసేందుకు ఎగబడ్డారు. దేశవ్యాప్తంగా ‘జవాన్’ థియేటర్లు జనాలతో కళకళలాడాయి. సౌత్ ఇండియాలో సైతం ఈ సినిమా హౌస్ ఫుల్ వసూళ్లతో రన్ అయింది. ఆ ఎఫెక్ట్ వసూళ్లలో బాగానే కనిపించింది. బాలీవుడ్ చరిత్రలోనే తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘జవాన్’ నిలిచింది.

ఇండియా వరకే దాదాపు రూ.90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ‘జవాన్’.. వరల్డ్ వైడ్ రూ.130 కోట్ల కలెక్షన్లతో తొలి రోజు హిందీలో ఆల్ టైం నంబర్ వన్ గ్రాసర్‌గా నిలిచింది. ఐతే ఓవరాల్ రికార్డుల్లో మాత్రం షారుఖ్ సినిమా ఐదో స్థానానికి పరిమితం అయింది. రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ రూ.223.5 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆయనే రూపొందించిన ‘బాహుబలి-2’ రూ.214.5 కోట్లతో రెండో స్థానంలో ఉంది. తొలి రోజు రూ.200 కోట్ల మార్కును అందుకున్నవి ఈ రెండు చిత్రాలు మాత్రమే. ‘కేజీఎఫ్-2’ రూ.164.5 కోట్లతో మూడో స్థానంలో ఉంది.

నాలుగో స్థానం ప్రభాస్ మూవీ ‘ఆదిపురుష్’ది. ఆ చిత్రం జూన్‌లో రిలీజై రూ.136.5 కోట్లు వసూలు చేసింది తొలి రోజు. ఈ చిత్రానికి డే-1 ఎంత నెగెటివ్ టాక్ వచ్చిందో తెలిసిందే. ఆ టాక్‌ను తట్టుకుని ఆ వసూళ్లు రాబట్టడం చిన్న విషయం కాదు. ‘బాహుబలి-2’ అంటే మేజర్ క్రెడిట్ రాజమౌళిదే కానీ.. ‘ఆదిపురుష్’కు అంత భారీ ఓపెనింగ్స్ రావడంలో ప్రభాస్ పాత్ర కీలకం. ‘జవాన్’ అంచనాలను మించి ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ.. షారుఖ్ స్టార్ పవర్‌లో ప్రభాస్‌ను మాత్రం మించలేకపోయాడు.