గత వారం విడుదలై మొదటి మూడు రోజులు భారీ సందడి చేసిన విజయ్ దేవకొండ ఖుషి మొన్న సోమవారం నుంచే విపరీతమైన డ్రాప్ నమోదు చేసి ట్రేడ్ లో ఆందోళన రేకెత్తించింది. వైజాగ్ లో భారీ సక్సెస్ మీట్ చేసి, వంద కుటుంబాలకు లక్ష చొప్పున పంచుతానని హీరో పబ్లిక్ గా ప్రకటించినప్పటికీ దాని ప్రభావం కలెక్షన్లలో కనిపించలేదు. దానికి తోడు మైత్రి సంస్థ హఠాత్తుగా ప్రమోషన్లు స్లో చేసేయడంతో భారం మొత్తం పబ్లిక్ మీదే పడిపోయింది. సరే ఇంకో వీకెండ్ లో మళ్ళీ పికప్ అవుతుందేమో, కొత్త రిలీజులకు మిక్స్డ్ టాక్ వస్తే ఫ్యామిలీస్ కి ఖుషినే ఆప్షన్ అవుతుందని ఫ్యాన్స్ ఎదురు చూశారు.
కానీ జరుగుతోంది వేరు. జవాన్ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. మొదటి వారంలో తగ్గడమనే ప్రశ్నే ఉండదు . హిందీ రాని తెలుగు మాస్ శుభ్రంగా డబ్బింగ్ వెర్షన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మాములుగా నైజామ్ లోనే స్ట్రాంగ్ గా ఉండే షారుఖ్ ఖాన్ ఈసారి ఆంధ్రాలోనూ భారీ వసూళ్లు రాబడుతున్నాడు. ఇక సమాంతర పోటీ కాకపోయినా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నవీన్ పోలిశెట్టి హ్యూమర్, లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క కనిపించడం జనాన్ని థియేటర్లకు తీసుకొస్తున్నాయి. కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ డీసెంట్ గా ఉందనే మాటే వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో వీటిని కాదని తిరిగి ఖుషికి పికప్ ఇవ్వడం అంత సులభంగా కనిపించడం లేదు. మైత్రి పంపిణి కాబట్టి చాలా చోట్ల రెండో వారానికి ప్రీమియర్ స్క్రీన్లను అట్టిపెట్టారు. కానీ కనీసం సగం హౌస్ ఫుల్స్ పడకపోతే డెఫిషిట్ వచ్చి దాన్ని గ్రాస్ లో తీసేస్తే వచ్చే షేర్ నామమాత్రంగా మారిపోతుంది. ఖుషికి ఇలాంటి విపత్కర పరిస్థితి అయితే మొదలైంది. ఒకవేళ శని ఆదివారాలు ఏదైనా అనూహ్యమైన పెరుగుదల చూపిస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అసాధ్యం. ఇంకో 15 కోట్ల దాకా రావాలి. పైగా సెప్టెంబర్ 15న చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీలు వస్తున్నాయి. సో ఏ ఛాలెంజ్ అయినా ఈ వారంలోనే నెగ్గి చూపించాలి. లేదంటే ఫ్లాప్ ముద్రతప్పేలా లేదు.