బన్నీ వద్దని చెప్పడమే మంచి పనైంది

స్టార్ సినిమాల్లో ఇంత హీరోలు క్యామియోలు చేయడం ఇటీవలి కాలంలో బాగా ప్లస్ అవుతోంది. వాటి వల్ల క్లైమాక్స్ కు ముందు ఓ రేంజ్ ఎలివేషన్లు పడి సినిమా స్థాయి పెరుగుతోంది. జైలర్ లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ లు లేకపోతే ఇంపాక్ట్ తగ్గేదన్న మాట వాస్తవం. తాజాగా రిలీజైన జవాన్ లో చివరి ఘట్టంలో వచ్చే సంజయ్ దత్ పాత్ర కోసం దర్శకుడు అట్లీ ముందు విజయ్ తర్వాత అల్లు అర్జున్ ని సంప్రదించాడని చెన్నై వర్గాలు కొన్ని నెలల క్రితమే వెల్లడించాయి. అయితే వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఆఖరికి దాన్ని సంజయ్ దత్ తో చేయించి సర్దుకోవాల్సి వచ్చింది.

తీరా చూస్తే ఆ పాత్ర వల్ల జవాన్ కు కలిగిన మేలు పెద్దగా లేదు. బజాజ్ స్కూటర్ మీద జైలుకు వచ్చి షారుఖ్ ని పట్టుకునే పనిలో పడే తమిళనాడు ఆఫీసర్ పాత్రలో సంజు బాబా అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఒకవేళ విజయ్ లేదా బన్నీ చేసుంటే కొంచెం స్కేల్ పెరిగేదేమో కానీ క్యారెక్టర్ డిజైనే సోసోగా ఉండటం వల్ల ఆ ఎపిసోడ్ లోనూ కింగ్ ఖానే డామినేషన్ చేశాడు. దీన్ని బట్టి అల్లు అర్జున్ నో చెప్పి చాలా తెలివైన నిర్ణయమే తీసుకున్నాడు. విజయ్ సంగతి సరేసరి. జవాన్ కు వచ్చిన రెస్పాన్స్ మాత్రం నార్త్ నుంచి సౌత్ దాకా రచ్చో రచ్చ అనిపించేలా ఉంది.

ఇది కాసేపు పక్కనపెడితే అల్లు అర్జున్ తో ఓ ప్యాన్ ఇండియా మూవీ తీయాలనే ప్లాన్ లో ఉన్న అట్లీ ఆ మధ్య ఒక స్టోరీ లైన్ కూడా విన్పించాడన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జవాన్ ఫలితం కళ్ళముందు కనిపిస్తోంది కాబట్టి ప్రాజెక్టు ముందుకెళ్లే అవకాశాలు మెరుగయ్యాయి. జాతీయ అవార్డు వచ్చాక బాధ్యత మరింత పెరగడంతో పుష్ప 2 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న బన్నీ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. లీకులు లేకుండా అల్లు కాంపౌండ్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ కాంబో ఫుల్ లెన్త్ లో సెట్ అయితే అంతకంటే ఫ్యాన్స్ కి పండగేముంది.