ఈ వేసవిలో భారీ అంచనాల మధ్య విడుదలైన అఖిల్ మూవీ ఏజెంట్ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. రూ.80 కోట్ల బడ్జెట్లో తీసిన సినిమా అందులో పదిశాతం షేర్ కూడా రాబట్టలేకపోయింది థియేట్రికల్ రన్లో. ఐతే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసి నాలుగు నెలలు దాటినా ఇప్పటిదాకా ఓటీటీలో రిలీజ్ కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
నిజానికి ఈ సినిమా థియేటర్లలో ఉండగానే డిజిటల్ రిలీజ్ గురించి సోనీ లివ్ ఓటీటీ వాళ్లు అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఈ సినిమాను డిజిటల్‌గా రిలీజ్ చేయాలని కూడా అనుకున్నారు. కానీ ఎందుకో తర్వాత ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. వారం తిరిగేసరికే థియేటర్ల నుంచి లేచిపోయిన ఈ చిత్రాన్ని డిజిటల్‌గా రిలీజ్ చేయడానికి ఎందుకు పునరాలోచించారో అర్థం కాలేదు.
మధ్యలో ఈ సినిమాను డిజిటల్ రిలీజ్‌కు తగ్గట్లుగా ఎడిట్ చేస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ నిర్మాతతో విభేదాలు తలెత్తి ఈ ప్రాజెక్టు నుంచి దర్శకుడు సురేందర్ రెడ్డి రిలీజ్ వీక్‌లోనే దూరం జరిగాడు. మరి ఎడిటింగ్ సంగతి ఏమైందో ఏమో తెలియదు. నెలలు గడుస్తున్నాయి. ఏజెంట్ ఓటీటీ రిలీజ్ సంగతి ఏమైందో తెలియదు. డబ్బులు పెట్టి సినిమా డిజిటల్ రైట్స్ కొన్న సోనీ లివ్ వాళ్లు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలియదు.
బహుశా సినిమా డిజాస్టర్ కావడంతో ముందు చెల్లిస్తామన్న మొత్తం ఇవ్వడానికి సోనీ లివ్ వాళ్లు వెనుకంజ వేసి ఉండొచ్చేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయి ఓటీటీలో అయినా అఖిల్ కోసం చూద్దాం అనుకున్న అక్కినేని అభిమానులకు… అసలెందుకీ సినిమా అంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలుసుకోవాలని అనుకున్న సగటు ప్రేక్షకులకు నిరాశ తప్పట్లేదు. మరి నిర్మాత అనిల్ సుంకర డిజిటల్ రిలీజ్ ఎప్పుడు చేయిస్తారో?