సౌండే లేదు.. స‌డెన్‌గా రిలీజ్ డేట్

మ‌హేష్ బాబు బావ‌, కృష్ణ అల్లుడు అనే గుర్తింపుతోనే చాన్నాళ్ల సినిమాలు చేసిన సుధీర్ బాబు.. స‌మ్మోహ‌నం ద‌గ్గ‌ర్నుంచి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపుతో సాగిపోతున్నాడు. ఐతే స‌రైన క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కోసం చూస్తున్న సుధీర్‌కు ఆ ఆశే తీర‌ట్లేదు. శ్రీదేవి సోడా సెంట‌ర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్.. ఇలా వ‌రుస‌గా సుధీర్ సినిమాలు నిరాశ ప‌రిచాయి. వీటి త‌ర్వాత అత‌డి నుంచి వ‌స్తున్న సినిమా మామామ‌శ్చీంద్ర‌.

న‌టుడు, రైట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. ఈ సినిమా టైటిల్, ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ అన్నీ కూడా వైవిధ్యంగా ఉండి ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించాయి. ఐతే ఇంట్రెస్టింగ్ టీజ‌ర్ త‌ర్వాత ఈ సినిమా వార్త‌ల్లో లేకుండా పోయింది. కొన్ని నెల‌ల నుంచి సైలెంట్‌గా ఉంది చిత్ర బృందం. ఈ సినిమా గురించి అంద‌రూ మ‌రిచిపోయారు. ఐతే ఇప్పుడు ఉన్న‌ట్లుండి రిలీజ్ డేట్ అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది మామా మ‌శ్చీంద్ర టీం. ఈ చిత్రాన్ని అక్టోబ‌రు 6న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ నెల చివ‌రి వారంలో చాలా సినిమాలు రిలీజ‌వుతుండ‌గా.. ఆ త‌ర్వాత‌, ద‌స‌రాకు మ‌ధ్య‌లో పెద్ద‌గా డిమాండ్ లేదు.

ఆ టైం చూసి మామా మ‌శ్చీంద్ర‌ను రిలీజ్ చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతానికి ప‌రిస్థితి చూస్తే సుధీర్ సినిమాకు పెద్ద‌గా పోటీ ఉండ‌క‌పోవ‌చ్చు. ఇప్ప‌టికే హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఓ సినిమాను డైరెక్ట్ చేయ‌గా.. అది విడుద‌ల‌కు నోచుకోలేదు. ఈసారి ఒక వెరైటీ క‌థ‌తో అత‌ను సినిమా తీశాడు. ఈ సినిమాలో సుధీర్ ర‌క‌ర‌కాల అవ‌తారాల్లో క‌నిపించ‌నున్నాడు. ముఖ్యంగా బొద్దుగా ఉన్న లుక్‌లో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్నాడు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మ‌రి సుధీర్‌కు ఈ సినిమా అయినా కోరుకున్న స‌క్సెస్ అందిస్తుందేమో చూడాలి.