ఓజీ ఓవర్సీస్.. ఎవరి లెక్క వారిది

ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న టీజర్ అంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీదే అని చెప్పాలి. కొన్నేళ్ల నుంచి పవన్ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. అభిమానుల దాహం తీరట్లేదు. ఆయన వరుసగా రీమేక్ మూవీస్ చేస్తుండటంతో అంతకంతకూ వాటిపై ఆసక్తి తగ్గిపోతున్న పరిస్థితి. అందుకే పవన్ సినిమాల ప్రోమోలు రిలీజైనా ఎగ్జైట్మెంట్ ఉండట్లేదు.

కానీ ‘ఓజీ’ టీజర్ మాత్రం వావ్ అనిపించింది. ఫ్యాన్స్ అనే కాక తెలుగు ప్రేక్షకలుందరికీ కూడా ఈ టీజర్ నచ్చింది. పవన్ ఒరిజినల్ స్క్రిప్ట్స్‌తో, తన ఇమేజ్‌కు తగ్గ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ‘ఓజీ’ చూపించింది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ ఉండగా.. టీజర్ లాంచ్ అయ్యాక ఆ హైప్ ఇంకా పెరిగిపోయింది. సినిమాకు బిజినెస్ పరంగా కూడా టీజర్ బాగా ప్లస్ అయినట్లు తెలుస్తోంది.

ఐతే ఇదే అదనుగా ‘ఓజీ’ ఓవర్సీస్ బిజినెస్ గురించి ఎవరికి నచ్చిన ఫిగర్స్ వాళ్లు వేసుకుంటున్నారు. ఒకరేమో రూ.13 కోట్లంటే.. ఇంకొకరేమో ఏకంగా 18 కోట్ల ఫిగర్ చెబుతున్నారు. నాన్-రాజమౌళి, ప్రభాస్ సినిమాల్లో ఇది రికార్డ్ అని మాట్లాడుకుంటున్నారు. ఐతే వాస్తవం ఏంటంటే.. ‘ఓజీ’ ఓవర్సీస్ డీల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. చర్చలు ఆరంభ దశలోనే ఉన్నాయి.

సినిమా రిలీజ్ ఎప్పుడో ఏంటో తెలియకుండా ఇంత ముందుగా బిజినెస్ పూర్తి కాదు. నిర్మాత కూడా టీజర్ వచ్చాక హైప్ బాగా పెరిగింది కాబట్టి.. రిలీజ్ ఖరారయ్యాక.. రిలీజ్ దగ్గర పడ్డాక రైట్స్ అమ్మితే మంచి రేటు వస్తుందని భావిస్తున్నాడట. సినిమాను సేల్ చేసి బయటపడిపోవాల్సిన స్థితిలో అయితే డీవీవీ దానయ్య లేడు. అందుకే ఆయన కూడా వేచి చూసే ధోరణిలోనే ఉన్నాడు. ఐతే సినిమాకు రూ.12-15 కోట్ల మధ్య రేటు పలకొచ్చని భావిస్తున్నారు. సినిమాకు యుఎస్ టార్గెట్ 3 మిలియన్లకు పైగానే ఉండబోతోంది.