‘బాహుబలి’ సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం రేపిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమాతో ప్రభాస్ ఇమేజ్ తిరుగులేని స్థాయికి చేరుకుంది. దేశవ్యాప్తంగా అతను ఫాలోయింగ్ సంపాదించాడు. అన్ని చోట్లా స్టార్ ఇమేజ్, మార్కెట్ తెచ్చుకున్నాడు. ఓవరాల్‌గా డిజాస్టర్ అయిన ‘సాహో’ ఉత్తరాదిన రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి హిట్ స్టేటస్ అందుకోవడం గమనార్హం.
దీన్ని బట్టే ప్రభాస్ నార్త్‌లో పెద్ద స్టార్ అయిపోయాడని స్పష్టం అయిపోయింది. ‘సాహో’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’, దాని తర్వాత కమిటైన నాగ్ అశ్విన్ సినిమా ప్రధానంగా తెలుగులో తెరకెక్కి మిగతా భాషల్లో అనువాదం కాబోతున్నాయి. వాటికి కూడా హిందీలో మంచి క్రేజ్ ఉంటుందనడంలో సందేహం లేదు. ఐతే ఈ లోపు ప్రభాస్ చాన్నాళ్లుగా చర్చల్లో ఉన్న డైరెక్ట్ హిందీ మూవీని అనౌన్స్ చేశాడు. అదే.. ఆదిపురుష్.
‘తానాజీ’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడు.. భూషణ్ కుమార్ సహా పేరు మోసిన నిర్మాతలు.. పైగా అందరికీ కనెక్టయ్యే రామాయణం నేపథ్యంలో సాగే కథ. ప్రభాస్ పోషించబోయేది రాముడి పాత్ర. హిందీలో నేరుగా అడుగు పెట్టడానికి ప్రభాస్‌కు ఇంతకంటే మంచి ప్రాజెక్టు ఇంకేముంటుంది? అనౌన్స్ కావడమే ఆలస్యం.. అందరూ దీన్ని బ్లాక్‌బస్టర్ అనేస్తున్నారు. ఈ సినిమా గురించి బాలీవుడ్ మీడియాలో అనేక వార్తలు, కథనాలు, విశ్లేషణలు కనిపిస్తున్నాయి.
తాజాగా ఒక టాప్ వెబ్ సైట్.. ప్రభాసే ఇండియాలో అసలైన పాన్ ఇండియా స్టారా అంటూ ఒక చర్చ పెట్టింది. ఇందులో పాల్గొన్న నిపుణులు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే బాలీవుడ్ స్టార్లకు దక్షిణాదిన అంతగా ఫాలోయింగ్, మార్కెట్ ఉండదు. సౌత్ సూపర్ స్టార్లు నార్త్‌లో వీక్. కానీ ప్రభాస్‌కు రెండు చోట్లా మాంచి ఫాలోయింగ్ ఉంది. పైగా అతడి ఫాలోయింగ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్టు సెట్ అయింది. ఇదంతా చూసి బాలీవుడ్ సూపర్ స్టార్లు కచ్చితంగా కంగారు పడుతూనే ఉంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది.