చెయ్యి లేని హీరోగా సూర్య ఫాంటసీ సినిమా

దక్షిణాదిలో అత్యధిక డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకడిగా వెలిగిపోతున్న లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయాలని తాపత్రయపడని హీరో లేడంటే అతిశయోక్తి కాదు. స్టార్ల కంటే వాళ్ళ అభిమానులు అతని కాంబినేషన్ కోసం తహతహలాడిపోతున్నారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన కిక్ అది. వచ్చే నెల విడుదల కాబోతున్న విజయ్ లియో మీద ఏ స్థాయిలో క్రేజ్ ఉందో కళ్లముందు కనిపిస్తోంది. లోకేష్ యునివర్స్ కాన్సెప్ట్ తో అందరినీ ఒకే మూవీ కలిపే ప్లానింగ్ లో ఉన్న ఇతనికి ఒక డ్రీం ప్రాజెక్ట్ ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే దీన్ని రాసుకుని నిర్మాత దొరక్క పక్కనపెట్టాడు.

దాని పేరు ఇరుంబుకాయ్ మాయావి. 1962లో వచ్చిన డిసి కామిక్స్ నవల ది స్టీల్ క్లాని ఆధారంగా చేసుకుని ఈ స్క్రిప్ట్ ని రాసుకున్నాడు. ఇది సూపర్ హీరో స్టోరీ. కాకపోతే కొన్ని నెగటివ్ షేడ్స్ ఉంటాయి. హీరోకు యాక్సిడెంట్ లో ఒక చెయ్యి పోతుంది. దాని స్థానంలో ఒక స్టీల్ హస్తాన్ని వాడుతుంటాడు. ఇంకో ప్రమాదంలో అనుకోకుండా ఒక శక్తి వచ్చి శరీరంతో సహా మొత్తం మాయమైపోయే వరాన్ని సంపాదిస్తాడు. చేయి మాత్రమే కనిపించే మహత్తు కూడా వస్తుంది. దీంతో అతను శత్రువుల ఆగడాలు కట్టిపెట్టి దేశం కోసం ఏం చేశాడనే పాయింట్ మీద డెవలప్ చేసినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

కాకపోతే ఇప్పటి ఆడియన్స్ టేస్ట్ కి అనుగుణంగా కీలక మార్పులు చేసి సూర్య అయితేనే న్యాయం చేస్తాడని భావించి ఫుల్ వెర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. కార్యరూపం దాల్చడానికి టైం పడుతుంది కానీ ఫైనల్ గా అయితే తీయాలనే డిసైడ్ అయ్యాడట. మాఫియా బ్యాక్ డ్రాప్ లో అధిక శాతం సినిమాలు చేసిన లోకేష్ దీంతో ఒక కొత్త జానర్ ని టచ్ చేసినట్టు అవుతుంది. ఈ తరహా ఫాంటసీని సూర్య గతంలో రాక్షసుడుగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో చేశారు. రోలెక్స్ గా తనకో ప్రత్యేక ఇమేజ్ ఇచ్చిన లోకేష్ నిజంగా చెప్పాలే కానీ సూర్య మాత్రం కాదంటాడా ఏంటి.