టైగర్ మీమాంస – రానట్టా వస్తున్నట్టా

సెప్టెంబర్ 28ని సలార్ వదిలేసుకున్నాక బంగారం లాంటి లాంగ్ వీకెండ్ ని చూస్తూ చూస్తూ వదులుకోవడానికి ఇతర నిర్మాతలు ఇష్టపడటం లేదు. ఆల్రెడీ చిన్న సినిమా మ్యాడ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ బృందం దాదాపు ఫిక్స్ అయినట్టే. రేపు ప్రెస్ మీట్ లో ప్రకటించే అవకాశముంది. పెదకాపు పార్ట్ 1 వచ్చే ఛాన్స్ ఉంది కానీ నిర్మాణ సంస్థ దానికి సంబంధించి ఎలాంటి లీక్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది. ఇవన్నీ సరే కానీ మాస్ మహారాజా టైగర్ నాగేశ్వరరావు సైతం ఒక రోజు ఆలస్యంగా 29న రావాలని విశ్వప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.

దసరా బరిలో భగవంత్ కేసరి, లియోలతో ఫేస్ టు ఫేస్ తలపడటం కన్నా ముందుగా రావడం వల్ల సోలో ఓపెనింగ్ తో భారీ వసూళ్లు రాబట్టుకోవచ్చు. కానీ దీనివల్ల టైగర్ నాగేశ్వరరావు టీమ్ పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ పట్టుదలగా ఉన్నప్పటికీ దర్శకుడు వంశీ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూదదనే ధోరణితో వెంటనే కమిట్ మెంట్ ఇవ్వలేకపోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఆయన కనక ధీమాగా ఈ నెల మూడో వారానికే ఫస్ట్ కాపీ సిద్ధం చేస్తానంటే ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో విఎఫెక్స్ వర్క్ చాలా బ్యాలన్స్ ఉందట.

సో దర్శకుడు నిర్మాత మధ్య ముందు ఏకాభిప్రాయం వచ్చి డబ్బింగ్ వగైరా కార్యక్రమాలు వేగవంతం చేస్తే టార్గెట్ ని రీచ్ కావొచ్చు. దానికన్నా ముందు ప్రమోషన్లు పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. ఎంత రవితేజ అయినా పబ్లిసిటీని లైట్ తీసుకుంటే రిస్క్ లో పడతారు. ధమాకా విజయంలో ఇది చాలా కీలకంగా పని చేసింది. ఇంకా  జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేయాల్సిన బ్యాక్ గ్రౌండ్ పెండింగ్ ఉందట. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించిన ఈ పీరియాడిక్ డ్రామా మీద కోర్టు వివాదాలు కూడా మొదలయ్యాయి. మరి రిలీజ్ కథ ఏ మలుపులు తిరిగి ఎక్కడ నిలుస్తుందో వేచి చూడాలి.