24 గంటల వ్యవధిలో మొత్తం కథ మారిపోయింది. నిన్న ఉదయం వరకు సలార్ హైప్‌తో ఊగిపోతూ వచ్చిన అభిమానులు.. ఒక్క రోజు వ్యవధిలో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. ఈ నెల 28న విడుదల కావాల్సిన ప్రభాస్ కొత్త చిత్రం ‘సలార్’ వాయిదా పడిపోయింది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదన్న మాటే కానీ.. అది లాంఛనమే అనడంలో సందేహం లేదు. యుఎస్‌లో ప్రిమియర్స్ షోలకు సంబంధించి టికెట్ల అమ్మకాలన్నీ ఆగిపోయి ఆల్రెడీ బుక్ అయిన టికెట్లక రీఫండ్స్ కూడా ఇచ్చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్లు కావడంతో తీవ్రంగా నిరాశ చెందిన ప్రభాస్ ఫ్యాన్స్.. ‘సలార్’ మీదే తమ ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమాకు వచ్చిన హైప్ చూస్తే.. గత చేదు అనుభవాలన్నీ చెరిగిపోయే రేంజిలో ప్రభాస్‌కు భారీ బ్లాక్ బస్టర్ రావడం గ్యారెంటీ అనే అంచనాలు ఏర్పడ్డాయి. ‘సలార్’ సెప్టెంబరు 28న వస్తుందా లేదా అనే విషయంలో కొన్ని నెలల ముందే చర్చ జరిగింది. కానీ చిత్ర బృందమే ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ ఎప్పటికప్పుడు కౌంట్ డౌన్ నడుపుతూ వచ్చింది. 100 రోజుల్లో సలార్.. 50 రోజుల్లో సలార్ అంటూ ఊరించింది.
రిలీజ్ డేట్‌ను అందుకోవడంలో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించింది. అది చూసే ఓవర్సీస్‌లో రిలీజ్‌కు నెల రోజుల ముందే టికెట్ల అమ్మకాలు కూడా మొదలయ్యాయి. కానీ రిలీజ్ నెలలోకి అడుగు పెట్టగానే కథ మారిపోయింది. వాయిదా న్యూస్ బయటికి వచ్చింది. దీంతో ఇటు అభిమానుల్లో, అటు డిస్ట్రిబ్యూటర్లలో మామూలు ఫ్రస్టేషన్ లేదు. ఇంత పెద్ద సినిమా తీసిన టీంకు ఆ మాత్రం ప్లానింగ్ ఉండదా.. ఈ ఒక్క సినిమా మీద ఆధారపడి పదుల సంఖ్యలో వేరే చిత్రాల రిలీజ్ ప్లానింగ్ ఆధారపడి ఉన్నపుడు బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం లేదా అని ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అసహనం వ్యక్తమవుతోంది.
ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ఇండస్ట్రీల సినిమాల ప్లానింగ్ దానికి అనుగుణంగా ఉంటుంది. ఇప్పుడు ‘సలార్’ వాయిదాతో మొత్తం గందరగోళంగా తయారైంది పరిస్థితి. చాలా సినిమాల డేట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి. పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదన్న మాట వాస్తవమే కానీ.. ప్లానింగ్ లేకపోవడం వల్లే ఈ సమస్య అంటూ ఇటు ఫ్యాన్స్, అటు ఇండస్ట్రీ వర్గాలు ‘సలార్’ టీంను తిట్టిపోస్తున్నారు.