పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒరిజినల్ స్టామినాకు.. ఆయన చేసే సినిమాలకు అసలు పొంతన ఉండట్లేదని చాలా ఏళ్లుగా అభిమానులు ఫీలవుతున్నారు. కెరీర్ ఆరంభంలో తనపై మరీ అంచనాలేమీ లేనపుడు తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలతో యువతను ఉర్రూతూలగించి ఊహించని రేంజికి వెళ్లిపోయాడు పవన్.
ఐతే ‘ఖుషి’ తర్వాత అసాధారణ స్థాయికి చేరుకున్న పవన్ ఇమేజ్‌కు తగ్గట్లు సినిమాలు తీయడంలో చాలామంది దర్శకులు విఫలమయ్యారు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది మినహాయిస్తే పవన్ ఫ్యాన్స్‌ను సంతృప్తిపరిచిన చిత్రాలేవీ లేవు. అందులోనూ ‘అత్తారింటికి దారేది’ తర్వాత అయితే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా తయారైంది. ‘అజ్ఞాతవాసి’ లాంటి డిజాస్టర్ ఇచ్చి సినిమాలకు దూరమైన పవన్.. రీఎంట్రీ ఇచ్చాక అభిమానుల ఆకాంక్షలకు భిన్నంగా వరుసగా రీమేక్ సినిమాలు చేశాడు.
వకీల్ సాబ్, భీమ్లానాయక్, బ్రో.. ఈ మూడు రీమేక్ చిత్రాలను ఉన్నంతలో మెరుగ్గానే తీర్చిదిద్దినా.. పవన్ ఒరిజినల్ స్టామినాను చూపించకపోవడంతో అభిమానుల్లో నిరాశ తప్పలేదు. పవన్ ముందు తక్కువగా ఉన్న హీరోలంతా స్ట్రెయిట్ సినిమాలతో పాన్ ఇండియా రేంజికి వెళ్లిపోతుంటే.. వాళ్లను మించిన ఇమేజ్, ఫాలోయింగ్ ఉన్న పవన్.. ఇలా మొక్కుబడిగా రీమేక్‌లు చేసి తన రేంజ్ తగ్గించుకుంటూ ఉండటం అభిమానులకు ఏమాత్రం రుచించలేదు.
సినిమాలకు పవన్ ప్రాధాన్యం ఇవ్వకపోవడం వాస్తవమే అయినా.. అప్పుడప్పుడూ అయినా తన స్టామినాకు తగ్గ సినిమా చేయాలని వాళ్లు ఆశపడ్డారు. ఎట్టకేలకు వారి ఆశ తీరుతోంది. పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన సుజీత్.. పవర్ స్టార్‌ను అభిమానులు కోరుకునే పవర్ ఫుల్ పాత్రలో ప్రెజెంట్ చేస్తూ తీసిన ‘ఓజీ’ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ముందు నుంచే ఈ టీజర్‌కు మామూలు హైప్ లేదు. ఆ హైప్‌కు ఏమాత్రం తగ్గని రీతిలో టీజర్ ఉండటంతో పవన్ అభిమానులకు పూనకాలు వచ్చేశాయి. ఇదయ్యా నీ పవర్.. దాన్ని దృష్టిలో పెట్టుకుని సరైన కథలు ఎంచుకోవయ్యా అంటూ పవన్‌ను కోరుతూ ఆయన పుట్టిన రోజును సెలబ్రేట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇలాంటి రెండు మూడు సినిమాలు పడితే పవన్ ముందు ఎవరూ నిలవరేన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates