ఊహించని పిడుగు ప్రభాస్ అభిమానుల గుండెల మీద పడేలా ఉంది. భారీ అంచనాలు మోస్తూ రికార్డులన్నీ బద్దలు కొడుతుందని ఎదురు చూసిన సలార్ విడుదల వాయిదా పడిందనే వార్త ఇటు మీడియా అటు ఇన్స్ టా, ట్విట్టర్ లాంటి ప్లాట్ ఫార్మ్స్ ని ఊపేస్తోంది. హోంబాలే ఫిలింస్ అధికారికంగా చెప్పకపోయినా బెంగళూరుకు చెందిన డిస్ట్రిబ్యూటర్లకు దీనికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం అందటం వల్లే ఇప్పుడీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇది తెలియడం ఆలస్యం నిన్న ట్రైలర్ వదిలిన మ్యాడ్ థియేటర్ రిలీజ్ డేట్ ని సెప్టెంబర్ 28ని ప్రకటించడం గమనించాల్సిన విషయం.
స్కంద సైతం ఇదే డేట్ వైపు చూస్తోందని ఇన్ సైడ్ టాక్. సెప్టెంబర్ 15న చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీతో పోటీ ఉండటం వల్ల ఇతర భాషల్లో ఇబ్బందులు తలెత్తుతాయని గుర్తించిన నిర్మాతలు దానికి అనుగుణంగా వాయిదా వైపు మొగ్గు చూపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక సలార్ విషయానికి వస్తే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా బ్యాలన్స్ ఉన్నాయట. సిజి వర్క్ పట్ల దర్శకుడు ప్రశాంత్ నీల్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో సదరు కంపెనీ మళ్ళీ ఫ్రెష్ గా పని మొదలుపెట్టినట్టు తెలిసింది. కేవలం మూడు వారాల డెడ్ లైన్లో ఇదంతా పూర్తి చేయడం అసాధ్యం.
ఒకవేళ సలార్ పోస్ట్ పోన్ ఖరారైతే నెక్స్ట్ ఆప్షన్ గా డిసెంబర్ నే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే జనవరిలో గుంటూరు కారం, ఈగల్, హనుమాన్, విజయ్ దేవరకొండ 13లు ఆల్రెడీ కాచుకుని ఉన్నాయి. ఇప్పుడు హఠాత్తుగా సలార్ సంక్రాంతికంటే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఇతర నిర్మాతలు, బయ్యర్ల నుంచి సైతం వ్యతిరేకత వస్తుంది. ఏదైనా సరే వీలైనంత త్వరగా అనౌన్స్ చేయడం మంచిది. కెజిఎఫ్ 1 తరహాలో సలార్ సీజ్ ఫైర్ లోనూ ఒక ఐటెం సాంగ్ ప్లాన్ చేశారట కానీ ప్రభాస్ ఇప్పుడు షూట్ లో పాల్గొనే పరిస్థితి లేదు. ఇది కూడా ఒక కారణమేననే టాక్ అంతర్గతంగా జరుగుతోంది