బాలీవుడ్లో నెపోటిజం, దాని దుష్ప్రభావాల గురించి.. రెండు నెలలుగా ఎడతెగని చర్చ జరుగుతోంది. ప్రతిభావంతుడైన యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడటానికి పరోక్షంగా నెపోటిజం కారణమన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
స్టార్ కిడ్స్, వాళ్లను ముందుకు నడిపించే బ్యాచ్.. వీళ్లంతా ఒక్కటై సుశాంత్ లాంటి వాళ్లు ఎదగకుండా తొక్కేస్తున్నారన్నది చాలామంది వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. సుశాంత్ లాంటి వాళ్లు ఎంతో కష్టపడి అవకాశాలు దక్కించుకుని, ప్రతిభ చాటుకున్నా కూడా భారీ చిత్రాల్లో అవకాశాలు రావని.. కానీ ఫిలిం బ్యాగ్రౌండ్ ఉంటే మాత్రం చాలా ఈజీగా మెగా ప్రాజెక్టుల్లో ఛాన్సులు వచ్చేస్తాయని.. కరణ్ జోహార్ లాంటి వాళ్లు ఇలాంటి వాళ్ల కోసమే సినిమాలు తీస్తుంటారని విమర్శలు, ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడీ చర్చ జరుగుతున్న సమయంలోనే రెండేళ్ల కిందటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి తన ‘సింబా’ మూవీ ప్రమోషన్ల కోసం హీరో హీరోయిన్లు రణ్వీర్ సింగ్, సారా అలీ ఖాన్‌లతో కలిసి ఓ టీవీ షోలో పాల్గొన్నప్పటి వీడియో అది. అందులో తాను సైఫ్ కూతురైన సారాకు ఎలా అవకాశం ఇచ్చింది అతను వెల్లడించాడు.
ఆమె తన ఆఫీసుకు వచ్చి.. నాకు పనివ్వండి నాకు పనివ్వండి అని రెండు మూడుసార్లు అడిగిందని.. సైఫ్ కూతురు అయి ఉండి అలా అడగడం చూసి తనకు కన్నీళ్లు వచ్చాయని.. దీంతో ‘సింబా’లో ఆమెకు కథానాయికగా అవకాశమిచ్చానంటూ సారా ఎంత ‘కష్టపడిందో’ తెలియజేశాడు రోహిత్.
దీనికి ఆ షోలో చప్పట్లు మార్మోగిపోయాయి. స్టార్ కిడ్స్‌కు ఎంత ఈజీగా అవకాశాలు వస్తాయో.. వాళ్లు కాస్తంత కష్టపడ్డా, బాధపడ్డా బాలీవుడ్ బడా దర్శకులు, నిర్మాతలు ఎంతగా కరిగిపోతారో చెప్పడానికి ఈ వీడియో రుజువంటూ ఇప్పడు దాన్ని ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. సారా స్థానంలో బ్యాగ్రౌండ్ లేని ఓ నటి లేదా నటుడు వచ్చి పనివ్వండని అడిగితే.. రోహిత్ అవకాశం ఇచ్చేవాడా.. స్టార్ కిడ్స్‌ను బాలీవుడ్‌ను ఎలా మోస్తుందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.