చంద్రముఖి 2 హీరో ఎందుకు మారాడంటే

సౌత్ సినిమాల్లో హారర్ కామెడీ థ్రిల్లర్స్ లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమాగా చంద్రముఖి ఎప్పటికీ మర్చిపోలేని ఐకానిక్ మూవీగా నిలిచిపోయింది. ఇన్ని సంవత్సరాలు గడిచాక కూడా దాని ప్రభావం దర్శకుల మీద ఉండటం చిన్న విషయం కాదు. ఇది ఎంతగా అంటే ఒరిజినల్ మలయాళం వెర్షన్ మణిచిత్రతరాజు కంటే దీన్నే ఎక్కువగా ఇష్టపడే రేంజ్ లో బ్లాక్ బస్టరయ్యింది. రజనీకాంత్ స్థాయి సూపర్ స్టార్ ఇలాంటి దెయ్యం చిత్రంలో నటించడం, అది చరిత్ర సృష్టించే రేంజ్ లో ఆడటం అంత సులభంగా మర్చిపోయేది కాదు. సహజంగానే సీక్వెల్ మీద అంచనాలు పెరుగుతాయి.

లారెన్స్ నటించిన చంద్రముఖి 2 వచ్చే నెల 15 విడుదల కాబోతోంది. ఇటీవలే చెన్నైలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు పి వాసు మాట్లాడుతూ ముందు కథను రజనీకాంత్ కే వినిపించానని, అయితే ఇది లారెన్స్ కే బాగా సూటవుతుందని చెప్పడంతో క్యాస్టింగ్ మారిపోయిందని చెప్పుకొచ్చారు. ముని నుంచి హారర్ స్పెషలిస్టుగా మారిపోయిన అతనైతేనే ఈ సబ్జెక్టుకి న్యాయం చేయగలడని భావించి ఆ మేరకు కార్యరూపం దాల్చిందని అన్నారు. ఒకవేళ రజని ఒప్పుకుని ఉంటే దీని స్థాయి, స్కేల్ ఇంకా పెద్ద స్థాయిలో ఉండేవి కానీ ఇప్పుడు తక్కువేమీ లేదు.

తెలుగులో ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. ఆస్కార్ సాధించిన ఎంఎం కీరవాణి స్వరపరిచిన పాటలు తమిళ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. మొదటి భాగానికి సంగీతం అందించిన విద్యాసాగర్ కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 15న రామ్ స్కంద, విశాల్ మార్క్ ఆంటోనీలతో తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో చంద్రముఖి 2కి భారీ పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నారు. మాస్ మార్కెట్ లో బలమైన పట్టున్న లారెన్స్ కు దీని వల్ల పాజిటివ్ టాక్ దక్కించుకుంటే మాత్రం వసూళ్ల మోత ఖాయం. కాకపోతే రజనీకాంత్ స్వాగ్ ని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది.