ఈ అమ్మాయికి దిష్టి త‌గిలేస్తోంద‌బ్బా..

శ్రీలీల.. శ్రీలీల‌.. ఇప్పుడు టాలీవుడ్లో ఎక్క‌డ చూసినా మార్మోగుతున్న హీరోయిన్ పేరు ఇదే. పెళ్ళిసంద‌డి అనే ఔట్ డేటెడ్ సినిమాతో ఈ అమ్మాయి క‌థానాయిక‌గా ప‌రిచయం అయింది. మామూలుగా అయితే డిజాస్ట‌ర్ కావాల్సిన సినిమా అది. కానీ పాట‌లు.. హీరో హీరోయిన్ల ఆక‌ర్ష‌ణ ఆ సినిమాను బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గ‌ట్టెక్కించేశాయి. ఈ చిత్రంలో శ్రీలీల అందం, అభిన‌యం.. అన్నింటికీ మించి త‌న డ్యాన్స్ కుర్ర‌కారు మ‌తులు పోగొట్టేశాయి.

రెండో చిత్రం ధ‌మాకా అయితే డివైడ్ టాక్‌ను త‌ట్టుకుని బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డంతో శ్రీలీల వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేక‌పోయింది. క్రేజీ ఆఫ‌ర్ల‌తో చూస్తుండ‌గానే బిజీ అయిపోయింది. రాబోయే అయిదు నెల‌ల్లో ఆమె అయిదు సినిమాల‌తో.. అది కూడా పండుగ‌ల స‌మ‌యంలో చేయ‌బోయే సంద‌డి గురించి పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది.

వినాయ‌క‌చ‌వితికి స్కంద‌.. ద‌స‌రాకు భ‌గ‌వంత్ కేస‌రి.. దీపావ‌ళికి ఆదికేశ‌వ‌, క్రిస్మ‌స్‌కు ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్, సంక్రాంతికి గుంటూరు కారం.. ఇలా వ‌రుస‌గా పండుగ‌ల‌కు శ్రీలీల సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. కాబ‌ట్టి ఇక ముందు మీడియాలో ఆమెను మంచి మ‌రే హీరోయిన్ హైలైట్ కాదు. ఐతే చూస్తుండ‌గానే పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయిన‌ప్ప‌టికీ.. శ్రీలీల‌లో కొంచెం కూడా అహంకారం క‌నిపించ‌క‌పోవ‌డం విశేషం. తాజాగా స్కంద ప్రి రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల చాలా హుందాగా, అణ‌కువ‌గా వ్య‌వ‌హ‌రించిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

ఆమెది క‌ర్ణాట‌క‌లో స్థిర‌ప‌డ్డ తెలుగు కుటుంబం అయిన‌ప్ప‌టికీ.. చ‌క్క‌టి తెలుగులో మాట్లాడుతోంది.  హీరోయిన్లు తెలుగు మాట్లాడితే త‌క్కువైపోతారు అనే ఫీలింగ్ ఆమెకు లేదు. ఇక ఈ ఈవెంట్లో శ్రీలీల‌ చ‌క్క‌టి పాట కూడా పాడ‌ట‌మే కాక‌… స్టేజ్ మీద పెర్ఫామ్ చేసిన తీరూ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇలా బ‌హుముఖ ప్ర‌జ్ఞ చూపిస్తూ.. చాలా అణకువ‌తో వ్య‌వ‌హ‌రిస్తూ శ్రీలీల అంద‌రినీ క‌ట్టి ప‌డేస్తోంది. ఆమెకు దిష్టి త‌గులుతుందేమో అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.