ఎనిమిది నెలల్లో 10 డిజాస్టర్ల పాఠాలు

దసరా, విరూపాక్ష, బలగం, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్లు ఈ ఏడాదే వచ్చాయన్న ఆనందం ఉంది కానీ మరోపక్క చాలా దారుణమైన డిజాస్టర్లు వరసపెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటి పరిస్థితి ఎంత దారుణమంటే మొదటి వీకెండ్ లోనే బోల్తా కొట్టేసి కనీసం సగం థియేటర్ కూడా నింపలేనంత వీక్ గా పల్టీ కొట్టాయి. మొన్నొచ్చిన ‘గాండీవధారి అర్జున’తో వరుణ్ తేజ్ కు మరో మర్చిపోలేని పరాజయం ఖాతాలో పడింది. దీనికన్నా ముందు పెదనాన్న ‘భోళా శంకర్’ ఇంకా అన్యాయంగా టపా కట్టింది. రెండో వారంలోపే గల్లంతయ్యే రేంజ్ లో మెగాస్టార్ ని అవమానం పాలు చేసింది.

‘శాకుంతలం’తో దిల్ రాజు, గుణశేఖర్ లు ఎంత నష్టపోయారో వాళ్ళిద్దరికే తెలిసిన రహస్యం. మాస్ రాజా బ్రాండ్ ఒకటే సరిపోదని ‘రావణాసుర’ ఫలితం ఋజువు చేసింది. ‘ఏజెంట్’ ఏకంగా ఓటిటిలో రావడానికి కూడా జంకేంత ఘోరంగా పోయింది. కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సైతం బ్రేక్ ఈవెన్ లో సగాన్ని టచ్ చేయలేకపోయింది. నాగ చైతన్య కస్టడీ, గోపీచంద్ రామబాణం, నిఖిల్ స్పై, సందీప్ కిషన్ మైఖేల్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే అవుతుంది. బ్రో ఏదో పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ పుణ్యామాని లాస్ తగ్గించుకుందే తప్ప హిట్టు ముద్ర వేయించుకోని మాట వాస్తవం.

ఇవన్నీ హీరోలు లేదా దర్శకుల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బ తిన్నవే. మొత్తం కలుపుకుంటే డిస్ట్రిబ్యూటర్ల వైపు నుంచి కలిగిన నష్టం ఎంత లేదన్నా మూడు వందల కోట్లు దాటేసింది. వీటిలో కొన్నింటికి కనీసం డిజిటల్, శాటిలైట్ బిజినెస్ కూడా జరగలేదు. పరిస్థితి అంత అన్యాయంగా ఉంది. ఇంతకు ముందులా డబ్బింగులు కాపాడేస్తాయనే రోజులు పోయాయి. టీవీ ఛానల్స్ కొనడం తగ్గించి ఆ పెట్టుబడులు సీరియల్స్ మీద పెడుతున్నాయి. ప్రాక్టికల్ గా ఆలోచించకుండా కేవలం హంగులనే నమ్ముకుంటే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో పైన సినిమాలు ప్రత్యక్షంగా నిరూపించాయి. నేర్చుకోవడమే బాకీ.