జై భీమ్ అందుకే మిస్ చేసుకుందా

అన్ని ఇండస్ట్రీలలోనూ జాతీయ అవార్డులకు సంబంధించిన వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. పూర్తి ఆధిపత్యం సాధించిన టాలీవుడ్ వర్గాలు సంతోషంలో మునిగి తేలుతుండగా తమకు ఎందుకు మిస్ అయ్యిందనే కోణంలో ఇతరులు విశ్లేషణ చేసుకుంటున్నారు. అందులో ప్రధానంగా హాట్ టాపిక్ గా మారిన సినిమా జై భీమ్. సామజిక రుగ్మతలు, అన్యాయాల మీద దర్శకుడు టీజె జ్ఞానవేల్ రూపొందించిన ఈ ఎమోషనల్ కోర్ట్ రూమ్ డ్రామా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకున్నప్పటికీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి యునానిమస్ గా ప్రశంసలు దక్కించుకుని అందరితో శభాష్ అనిపించుకుంది.

ఊహించని విధంగా జై భీమ్ ఏ విభాగంలోనూ చోటు దక్కించుకోలేదు. అల్లు అర్జున్ సంపూర్ణంగా అర్హుడే అయినప్పటికీ సూర్య కూడా సరైన హక్కుదారుడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఇక్కడో కోణం ఆలోచించాలి. 2020లో సూరరై పోట్రు(ఆకాశం నీ హద్దురా)కు గాను ఆ ఏడాది సూర్య ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నాడు. తిరిగి అదే సంస్థ నుంచి వచ్చిందే జై భీమ్. వరుసగా రెండుసార్లు ఒకే యాక్టర్ కి ఇచ్చిన దాఖలాలు గతంలో పెద్దగా లేవు. పైగా పుష్పలో బన్నీకి వచ్చినంత పాపులారిటీ సూర్యకి తాను చేసిన మూవీ నుంచి రాలేదన్నది వాస్తవం. ఈ లాజిక్ మిస్ కాకూడదు.

ఇలా చూసుకుంటే ఎన్నో సినిమాలు, నటీనటులు తృటిలో మిస్ చేసుకున్న దాఖలాలు గతంలో, వర్తమానంలో ఎన్నో ఉన్నాయి. అలాంటిది కేవలం జై భీమ్ కి ఏదో వివక్ష జరిగిందనుకోవడం కరెక్ట్ కాదు. ఏదైతేనేం దక్షిణాది పరిశ్రమగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం అన్నీ ఒకే తాటిపై ఉంటూ ఒక్కటిగా సాగుతున్న టైంలో వీటిని విడివిడిగా చూడలేం కాబట్టి ఎవరికి వచ్చినా ఒకేలా భావించాలి. కోలీవుడ్ కు చెందిన మాధవన్ తీసిన రాకెట్రి ది నంబికి ఉత్తమ చిత్రంగా సముచిత గౌరవం దక్కింది కాబట్టి హెచ్చు తగ్గుల గురించి చర్చలు అనవసరమనే చెప్పాలి. కానీ సోషల్ మీడియా ఊరుకోదుగా.