చంద్రయాన్-3 సక్సెస్.. ఆయన ట్రెండింగ్

అమెరికా, రష్యా లాంటి అగ్ర దేశాలు భారీ బడ్జెట్ పెట్టినా సాధించలేదని.. ఇండియా తక్కువ ఖర్చుతోనే సాధించేసింది. చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌ను సూపర్ సక్సెస్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇక భారతీయుల ఆనందం అయితే అంతా ఇంతా కాదు. దేశం సాధించిన సాంకేతిక విజయంపై ఈ స్థాయిలో ప్రజలు ఉప్పొంగిపోవడం.. దాని గురించి ఇంతగా చర్చించుకోవడం ఎన్నడూ చూసి ఉండరు అంటే అతిశయోక్తి కాదు. నిన్న సాయంత్రం చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగిన సందర్భంగా కోట్ల మంది ఆ అద్భుత దృశ్యాన్ని లైవ్‌లో వీక్షించి ఉద్వేగానికి గురయ్యారు.

ఇక అప్పట్నుంచి సోషల్ మీడియాలో అంతగా ‘చంద్రయాన్-3’ గురించే చర్చ. ఎప్పుడూ సినిమాలు, క్రికెట్‌ వినోదంలో మునిగిపోయి ఉండే యువత సైతం ‘చంద్రయాన్-3’ గురించే మాట్లాడుకుంది. దేశ విదేశాల్లో ఉన్న ఇండియన్ యూత్ దీని మీదే డిస్కషన్లు పెట్టింది సోషల్ మీడియాలో. ఐతే ఓవైపు ‘చంద్రయాన్-3’ టాప్‌లో ట్రెండ్ అవుతుంటే.. దాని వెంటే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ పేరు కూడా అదే స్థాయిలో ట్రెండ్ అయింది. కానీ అది పాజిటివ్ వేలో మాత్రం కాదు.

కొన్ని రోజుల కిందటే ‘చంద్రయాన్-3’ని కించపరిచేలా ఒక కార్టూన్ పోస్ట్ షేర్ చేశాడు ప్రకాష్ రాజ్. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద దిగగానే పంపే తొలి ఫొటో అంటూ ఒక టీ మాస్టర్ ఫొటోను షేర్ చేసి వెటకారంగా కామెంట్ చేశాడు ప్రకాష్ రాజ్. ఐతే దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయాన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తూ విమర్శలు చేయడంతో ప్రకాష్ రాజ్ మీద ఆ రోజు నుంచే నెటిజన్లు ఎటాక్ చేస్తున్నారు. వారి దాడికి భయపడి ప్రకాష్ రాజ్.. ఆ పోస్ట్ ఉద్దేశం వేరు అంటూ వివరణ ఇచ్చుకున్నాడు. తాజాగా ‘చంద్రయాన్-3’ సక్సెస్ మీద పాజిటివ్ పోస్ట్ కూడా పెట్టాడు.

కానీ నెటిజన్లు మాత్రం ఆయన్ని వదిలిపెట్టట్లేదు. ‘చంద్రయాన్-3’ సక్సెస్‌తో ప్రకాష్ రాజ్ పరిస్థితి ఇదీ అంటూ ఆయన సినిమాల్లో బాగా ఫ్రస్టేట్ అయిన సీన్లు.. ఎదురు దెబ్బలు తిన్న సన్నివేశాల తాలూకు వీడియోలు, ఫొటోలు తెచ్చి పెట్టి ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అంతే కాక ప్రకాష్ రాజ్‌ను అరెస్ట్ చేయాలంటూ కొన్ని రోజులుగా పెడుతున్న హ్యాష్ ట్యాగ్‌ను కూడా జోడించి ఆయన మీద విమర్శలను కొనసాగిస్తున్నారు. మొత్తానికి ‘చంద్రయాన్-3’ మీద పెట్టిన పోస్టుతో ప్రకాష్ రాజ్ బాగానే అన్ పాపులర్ అయ్యాడని అర్థమవుతోంది.