ప్రకాష్ రాజ్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో ఒకరిగా ఆయన్ని చెప్పొచ్చు. కానీ వ్యక్తిత్వ పరంగా ఆయనలో మెరుపులూ ఉన్నాయి. మరకలూ ఉన్నాయి. తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజకీయాల విషయానికి వస్తే ఆయన కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీని, ఆయన సర్కారును తీవ్రంగా విమర్శిస్తారన్న సంగతి తెలిసిందే.
మోడీని తప్పుబట్టే విషయంలో ఆయన వ్యాఖ్యలు, విమర్శలు కొంత వరకు సహేతుకంగానే ఉంటాయి. మోడీ ప్రచార వ్యామోహాన్ని.. ఆయన వైఫల్యాలను ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు ఫ్యాన్స్ ఉన్నారు. కానీ అదే సమయంలో మోడీ మీద మరీ శ్రుతి మించి పెట్టే కొన్ని పోస్టుల మీద మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తుంటుంది.
మోడీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన మన దేశ ప్రధాని అని మరిచిపోయి దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ.. కించపరిచే కార్టూన్లు షేర్ చేస్తుంటాడు ప్రకాష్ రాజ్. తాజాగా ఆయన పెట్టిన పోస్టు ఒకటి న్యూట్రల్ నెటిజన్లలో కూడా తీవ్ర వ్యతిరేకత తీసుకొస్తోంది. ఇటీవలే ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టు మీద ప్రశంసల జల్లు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చంద్రుని మీదికి విక్రమ్ ల్యాండర్‌ను పంపారు. ఐతే ఈ ప్రయోగాన్ని ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ ‘బ్రేకింగ్ న్యూస్’ పేరుతో ఒక కార్టూన్‌ను షేర్ చేసి వ్యాఖ్యను జోడించాడు. అందులో ఒక వ్యక్తి టీ మగ్గుతో కనిపిస్తున్నాడు.
దీనికి ‘‘చంద్రుడి మీద విక్రమ్ ల్యాండర్ నుంచి వచ్చిన తొలి ఫొటో ఇది’’ అనే వ్యాఖ్య పెట్టాడు ప్రకాష్ రాజ్. ప్రధాని తనను తాను ఛాయ్ వాలా అని చెప్పుకుంటారన్న సంగతి తెలిసిందే. అంటే మోడీ చంద్రుడి మీదికి వెళ్లి ఫొటో తీసుకునే పనిలో ఉంటాడనే అర్థం వచ్చేలా ప్రకాష్ రాజ్ పోస్ట్ పెట్టాడు. ఐతే శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు మీద ఇలా జోకులు పేల్చడం పట్ల ప్రకాష్ రాజ్‌ను నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏ విషయాల్లో విమర్శులు చేయాలో ప్రకాష్ రాజ్‌కు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.