ఇంకా నెల రోజులకు పైగా టైం ఉన్నప్పటికీ చివరి నిమిషం హడావిడికి దూరంగా ఉండాలని హోంబాలే ఫిలిమ్స్ నిర్ణయించుకుంది. దీంతో సలార్ ఓవర్సీస్ బుకింగ్స్ ఆగస్ట్ 25 నుంచే ప్రారంభం కాబోతున్నయన్న వార్త యుఎస్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. ఐమాక్స్ వెర్షన్ కూడా రెడీ అవుతుండటంతో దానికి తగ్గట్టు స్క్రీన్లు ముందే బ్లాక్ చేసుకుని డిస్ట్రిబ్యూటర్లకు ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆదిపురుష్ టైంలో ఫ్లాష్ లాంటి హాలీవుడ్ మూవీస్ ఉండటం వల్ల సరైన రిలీజ్ దక్కక ఓపెనింగ్స్ మీద ప్రభావం పడింది. ఈసారి అలా జరిగే ఛాన్స్ ఇవ్వడం లేదు .
అక్కడే కాదు ఇండియాలోనూ కనీసం రెండు వారాల ముందు ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ చేసేలా ప్రణాళికలు వేస్తున్నారు. కొద్దిరోజుల ముందు టికెట్ రేట్ల పెంపు కోసం అప్లికేషన్లు, అదనపు షోల కోసం ప్రభుత్వ పెద్దలను బ్రతిమాలుకోవడాలు లాంటివి లేకుండా సదరు విన్నపాలు, వినతులు అన్నీ అధికారికంగానే సిద్ధం చేశారట. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే పర్మిషన్లు వచ్చేలా చూసుకుని టికెట్ల అమ్మకాలు షురూ చేస్తే అడ్వాన్స్ సేల్స్ లోనూ సరికొత్త రికార్డులు సృష్టించవచ్చనే దిశగా చాలా పద్దతిగా వెళ్తున్నారట. భాషతో సంబంధం లేకుండా అని రాష్ట్రాలకే ఒకే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు.
రిలీజ్ కు ఇంకో ముప్పై ఏడు రోజులే ఉండటంతో దర్శకుడు ప్రశాంత్ నీల్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ లు ఫైనల్ కాపీని సిద్ధం చేయడంలో తలమునకలై ఉన్నారు. ఎక్కువ పాటలు లేకపోవడంతో ఫోకస్ మొత్తం బీజీఎమ్ మీదే పెట్టారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎక్కడ చేయాలి, ప్రెస్ మీట్లు వగైరాలన్నీ ఇంకో వారంలో డిసైడ్ చేయాల్సి ఉంటుంది. భీభత్సమైన ప్రమోషన్లు చేయకపోయినా సలార్ హైప్ కి వచ్చిన ఇబ్బందేమీ లేదు. అంచనాలు ఆల్రెడీ ఆకాశాన్ని తాకుతున్నాయి. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ ఫలితాలతో సంబంధం లేకుండా ప్రభాస్ క్రేజ్ ఓ రేంజ్ లో బిజినెస్ చేసి పెట్టింది.