గన్స్ అండ్ గులాబ్స్ ఆకట్టుకుందా

ది ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలుగా రాజ్ అండ్ డికెలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. స్టయిల్, సస్పెన్స్ ని మిక్స్ చేస్తూ యాక్షన్ డ్రామాలను తీయడంలో వీళ్ళ శైలి చాలా ప్రత్యేకం. ఆ కారణంగానే పెద్ద స్టార్ హీరోలు సైతం వీళ్ళు అడగ్గానే వెబ్ సిరీస్ లకు ఓకే అంటారు. అందుకే కంటెంట్ అటు ఇటు ఊగినా షాహిద్ కపూర్ ఫర్జీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా గన్స్ అండ్ గులాబ్స్ అనే కొత్త సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో నిర్మించగా దుల్కర్ సల్మాన్ లాంటి క్యాస్టింగ్ ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేగింది. ఇంతకీ ఇది మెప్పించేలా ఉందా

గులాబ్ గంజ్ లో ఉండే బైక్ మెకానిక్ టిప్పు(రాజ్ కుమార్ రావు)తండ్రి హత్య వల్ల తానూ రెండు మర్డర్లు చేయాల్సి వస్తుంది. దీంతో అక్కడి నుంచి పారిపోవాలని ప్లాన్ చేసుకుంటాడు. ఆ ఊరికి బదిలీ మీద వస్తాడు పోలీస్ ఆఫీసర్ అర్జున్ వర్మ(దుల్కర్ సల్మాన్). చాలా స్ట్రిక్ట్. లోకల్ డాన్ గాంచి(సతీష్ కౌశిక్) కొడుకు జుగ్ను(ఆదర్శ్ గౌరవ్) ఎలాగైనా కుటుంబ దందాను వారసత్వంగా చేజిక్కించుకోవాలని చూస్తుంటాడు. ఈ ముగ్గురిని నల్లమందు రవాణాకు సంబంధించిన ఒక క్రైమ్ ముడిపెడుతుంది. ఇక్కడి నుంచి క్యాస్ట్ అండ్ మౌస్ గేమ్ షురూ. చివరికి ఏమైందో తెలియాలంటే సిరీస్ చూడాలి.

90 బ్యాక్ డ్రాప్ తీసుకున్న రాజ్ అండ్ డికెలు అప్పటి వాతావరణంలో ఒక మాఫియా థ్రిల్లర్ ని కామెడీ టచ్ తో చూపించే ప్రయత్నం చేశారు. అయితే నిడివి చాలా ఎక్కువ కావడంతో పాటు మూడు ఎపిసోడ్ల వరకు కథ నత్తనడకన సాగడం కొంత విసుగుకు కారణం అయ్యింది. క్యాస్టింగ్ ని అద్భుతంగా సెట్ చేసుకున్న ఈ జంట దర్శక ద్వయం అంతే స్థాయిలో స్క్రిప్ట్ ని రాసుకోలేదు. బోలెడు సమయం, ఓపిక ఉంటే ఓకే కానీ విపరీతమైన అంచనాలు పెట్టుకుని చూస్తే మాత్రం గన్స్ అండ్ గులాబ్స్ పూర్తి సంతృప్తినివ్వదు. ఒకవేళ సినిమాగా తీసుంటే అదిరిపోయేది. అయితే సిరీస్ గా మార్చుకోవడం వల్లే వచ్చింది తంటా.